- హరీశ్‌రావుది అప్పుడో మాట.. ఇప్పుడో మాట
- మూసీకి.. మల్లన్న సాగర్ కు ముడిపెట్టి రాజకీయాలు చేయొద్దు
- గజ్వేల్ లో మీడియా సమావేశంలో మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితుల ఫైర్
గజ్వేల్, వెలుగు: పచ్చని పంటలు పండే భూములు లాక్కొని, తమ బతుకులను నిండా ముంచిన కేసీఆర్ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తామని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల ప్రజలు హెచ్చరించారు. మంత్రిగా ఉన్నపుడు మాట మాట్లాడని హరీశ్ రావు.. అధికారం కోల్పోయాక ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా నష్టపరిహారం చెల్లించామని చెప్పడం దురదృష్టకరమన్నారు.
అప్పుడు రైతులుగా నలుగురికి అన్నం పెట్టే స్థితిలో ఉండేవారమని, ప్రస్తుతం పూట గడువని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు కంటతడి పెట్టారు. బుధవారం గజ్వేల్ లో మీడియా సమావేశంలో మల్లన్నసాగర్ ముంపు నిర్వాసితులు మాట్లాడుతూ.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ఇప్పటికైనా తమ సమస్యలు పట్టించుకోవాలన్నారు.
కన్నబిడ్డల్లా చూసుకుంటామని మాయ మాటలతో తమ భూములు లాక్కొని బతుకులు ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్వాసిత గ్రామాల ప్రజల పేరుతో దోచుకున్న డబ్బుకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీశ్‌రావు, ప్రతాప్‌రెడ్డి దృష్టికి తమ సమస్యలను పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించి దారి ఖర్చులకు రూ50 వేలు ఇచ్చామని చెప్పడం బాధాకరమన్నారు.
రాజకీయ ఉనికి కోసం అబద్ధపు, తప్పుడు ప్రచారం చేయొద్దని వారు హితవు పలికారు. మూసీకి.. మల్లన్న సాగర్ కు ముడిపెట్టి రాజకీయాలు చేయడం కాకుండా, కేసీఆర్, హరీశ్‌రావు ముంపు గ్రామాల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తమ బతుకులను ఆగం చేసిన బీఆర్ఎస్నేతలు, బ్రోకర్లు, అధికారులు తమ జోలికి వస్తే బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
మల్లన్న సాగర్ పేరుతో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. వీరిపై విచారణ జరిపి నిధులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఏంసీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తోగుట మాజీ పీఏసీఎస్ చైర్మన్ కురకుల మల్లేశం, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పల్లె పహాడ్ మాజీ ఉపసర్పంచ్ రమేశ్, స్వామి, రాములు లక్ష్మణ్ లస్కర్ సత్తయ్య, మల్లేశం, ధర్మారెడ్డి, లక్ష్మాపూర్ సత్తయ్య, శ్రీహరి, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.