కాంగ్రెస్​కు పట్టం కట్టిన..పల్లె తెలంగాణ

  • కాంగ్రెస్​కు పట్టం కట్టిన..పల్లె తెలంగాణ
  • జీహెచ్​ఎంసీ​లో దెబ్బతీసిన సెటిలర్ల ఓట్లు
  • వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్​కే.. పోలింగ్ సరళిపై విశ్లేషిస్తున్న కాంగ్రెస్ నేతలు
  • వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్​నగర్, ఖమ్మంలో హస్తం హవా
  • ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్​లోనూ మంచి సీట్లు 

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో పల్లె తెలంగాణ కాంగ్రెస్​పార్టీకి అండగా నిలిచింది. పలు జిల్లాల్లో ఆ పార్టీ సాధించిన సీట్లే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్​నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్​ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో మొత్తం 61 స్థానాలకు గాను 50 చోట్ల గెలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్​జిల్లాల్లోనూ కాంగ్రెస్ మంచి స్థానాలే దక్కించుకుంది. తెలంగాణ ఉద్యమ నిప్పు కణికగా చెప్పుకునే సింగరేణి బొగ్గు గనులు వ్యాపించి ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ విజయ ఢంకా మోగించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్​లో మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రాష్ట్రమంతటా హస్తం హవా కనిపించినప్పటికీ, గ్రేటర్ లో మాత్రం ఆ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. దీనికి కారణం ఏంటనే దానిపై కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకుంటున్నారు. గ్రేటర్ లో ఏపీ సెటిలర్లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. 

ఏపీ సెటిలర్లు బీఆర్ఎస్ ​వైపు నిలవడంతోనే తమకు సీట్లు రాలేదని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు లోక్​సభ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు నిలవొచ్చనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. వాళ్లను తమవైపు తిప్పుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

మెదక్ లో బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు..  

రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా 64 చోట్ల కాంగ్రెస్, ఒకచోట ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సీపీఐ గెలిచింది. బీఆర్ఎస్​39 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. ఎంఐఎం తమ ఏడు సిట్టింగ్​స్థానాలను నిలబెట్టుకుంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్​కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్​జిల్లాలు.. ఈసారి హస్తం పార్టీని అక్కున చేర్చుకున్నాయి. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 34 అసెంబ్లీ సీట్లు ఉండగా, అందులో నాలుగు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ ​దక్కించుకోగలిగింది. మిగతా 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ జెండా పాతింది. కేసీఆర్ సొంత జిల్లా మెదక్​లో మాత్రమే కాంగ్రెస్ ​కన్నా బీఆర్ఎస్​ ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. బీజేపీ ప్రాబల్యం పెరిగిన ఆదిలాబాద్, నిజామాబాద్ ​జిల్లాల్లోనూ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. గ్రేటర్​ హైదరాబాద్​ మాత్రమే కాంగ్రెస్​కు మొండి చేయి చూపింది. ఇక్కడ ఎక్కువగా ఉండే ఏపీ సెటిలర్లు.. కాంగ్రెస్​కు ఏకపక్షంగా ఓట్లు వేస్తారని అంచనా వేసినా, రిజల్ట్ మాత్రం వేరేలా వచ్చింది. సెటిలర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్​నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు భారీ మెజార్టీతో  గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చడం కూడా ఇందుకు కారణమైందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్ లో సీన్ రివర్స్.. 

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు తమ పార్టీకే ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకున్నారు. వాళ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్లు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపినట్టుగా పోలింగ్​కు ముందు అంచనా వేశారు. సెటిలర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్​ మీడియాలోనూ కనిపించింది. కానీ తీరా పోలైన ఓట్లను లెక్కించిన తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్​అయింది. సెటిలర్లు కాంగ్రెస్​కు అండగా నిలవకపోవడంతో గ్రేటర్​లో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 40.06 లక్షల ఓట్లు పోలవగా, అందులో 15.77 లక్షల ఓట్లు బీఆర్ఎస్​కు దక్కాయి. కాంగ్రెస్​ పార్టీకి 9.25 లక్షల ఓట్లు వచ్చినా ఒక్క సీటులోనూ గెలువలేదు. బీజేపీకి 9.10 లక్షల ఓట్లు పోలవగా గోషామహల్​ స్థానంలో గెలుపొందింది. గ్రేటర్​లో భాగం కాని రంగారెడ్డి జిల్లా రూరల్ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్​ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఐదు స్థానాలుండగా నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్​ గెలిచింది.

గత ఎన్నికల్లోనూ గ్రేటర్​లో బీఆర్ఎస్ హవా.. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి 21 సీట్లు మాత్రమే దక్కాయి. 63 చోట్ల బీఆర్ఎస్, 15 స్థానాల్లో టీడీపీ, ఎంఐఎం ఏడు స్థానాల్లో, ఐదు స్థానాల్లో బీజేపీ, మూడు చోట్ల వైఎస్సార్​సీపీ, బీఎస్పీ రెండు చోట్ల, సీపీఐ, సీపీఎం, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ నుంచి 88 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాంగ్రెస్ ​పార్టీ నుంచి 19 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఫార్వర్డ్​బ్లాక్​ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ​ఒకరు గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి 20 చోట్ల గెలుపొందగా, అందులో ఎక్కువ సీట్లు గ్రేటర్ ​హైదరాబాద్​లోనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి జైకొట్టిన గ్రేటర్​ఓటర్లు.. ఏడాది వ్యవధిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ​వైపు మొగ్గారు. 150 డివిజన్లకు గాను 99 చోట్ల కారు పార్టీని గెలిపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్​ ఓటర్లు బీఆర్ఎస్​కే అండ గా నిలిచారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ వైపే మొగ్గు చూపారు.

2018, 20‌‌23 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల వారీగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ​గెలిచిన సీట్లు