వాటర్​ సప్లై ఎట్లుంది?

వాటర్​ సప్లై ఎట్లుంది?
  • ప్రతిరోజూ వివరాల సేకరణ 
  • ఆన్​లైన్​ యాప్​లో నమోదు 
  • చాలాచోట్ల అందని భగీరథ నీళ్లు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి 

 కామారెడ్డి, వెలుగు: మిషన్​ భగీరథ కింద గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో మంచినీరు అందడంలేదు. రానున్న వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి తిప్పలు పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో తాగునీటి  పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోంది. గత ఐదు రోజులుగా జిల్లాలోని పంచాయతీల్లో విలేజ్​ సెక్రటరీలు తాగునీటి సప్లై వివరాలను సేకరిస్తున్నారు.

ఆన్​లైన్​ యాప్​ద్వారా డెయిలీ శానిటేషన్​ రిపోర్ట్​(డీఎస్​ఆర్​) లోప్రతిరోజు ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. ​ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోఉన్న కుటుంబాల సంఖ్య, నల్ల కనెక్షన్లు, కుటుంబ అవసరాలకు సరిపడా నీటి సప్లై జరుగుతుందా, నల్లాలు పరిస్థితి ఏమిటి, మిషన్​భగీరథ నీళ్లు సరిపోకపోతే ప్రత్యామ్నాయాలేమిటీ, ఎక్కడన్నా ఇతర వనరుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారా, అన్న వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని మండల స్థాయిలో ఎంపీవో, డివిజన్​ స్థాయిలో డీఎల్​పీవో, జిల్లా స్థాయిలో డీపీవో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 

150 గ్రామాల్లో భగీరథ ఫెయిల్​ 

 గత ప్రభుత్వం మిషన్​ భగీరథకోసం రూ. కోట్లు ఖర్చుచేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి స్థాయిలో తాగునీరు సరిగా అందడంలేదు. మిషన్ భగీరథ పనుల్లో పొరపాట్లు, లోపాలుఉండడం వల్ల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 875 హాబిటేషన్లు ఉన్నాయి.

ఇందులో 2,50,722 నల్లా కనెక్షన్లు బిగించినట్లు మిషన్ భగీరథ ఆఫీసర్లు చెప్తున్నారు. రూ. 312 కోట్లతో 612 ట్యాంకులు, 2,680 కిలో మీటర్ల పైపులైన్ నిర్మించారు. క్షేత్ర స్థాయిలో చాలా చోట్ల సరిగ్గా నల్లాలు బిగించలేదు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ మేరకు నీటి సప్లయ్​ జరగడం లేదు. భగీరథ ద్వారా నీరందక పోవడంతో స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా గ్రామ పంచాయతీలు మంచినీళ్లు సప్లయ్​చేస్తున్నాయి. పైపులైన్లు సరిగ్గా లేకపోవటం, మోటార్లు మోరాయించటం, గ్రామాలకు సరిపడా నీరు అందుబాటులో లేకపోవడం వల్ల పంచాయతీలు ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

జిల్లాలో దాదాపు 20 వేల నల్లాలు సరిగా బిగించలేదు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు గాను 150 గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు నీటి సరఫరా జరగడంలేదు. గాంధారి, సదాశివనగర్, జుక్కల్, రాజంపేట, మద్నూర్​, పెద్దకొడప్​గల్, తాడ్వాయి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లోని గ్రామాల్లో పైపులైన్​ లోపాల వల్ల మిషన్ భగీరథ స్కీమ్ విఫలమయ్యింది. దీంతో ఈ గ్రామాల్లో బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిరావండంతో పంచాయతీల మీద విద్యుత్​ బిల్లుల భారం పడుతోంది. వచ్చే సమ్మర్​ సీజన్​లో ఎక్కడా మంచినీళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సేకరించే సమాచారం ఉపయోగపడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

Also Read : ఎములాడ హామీలపై వెనక్కి పోవద్దు