
- ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలం ఖర్జీ, జంగాల్‌పేట గ్రామాల సమీపంలోని వాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి బెల్లంపల్లికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సోమవారం ఇరు గ్రామాల ప్రజలు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. సాగు, తాగునీటి వనరులను దెబ్బతీసే ఇసుక రీచ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, రెండు పంటలు పండే ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం వందలాది ట్రాక్టర్లు నడవడంతో రోడ్డంతా గుంతలమయంగా మారిందన్నారు. 15 ఏండ్ల పాటు తమ గ్రామాలకు బీటీ రోడ్లు లేక ఇబ్బందులు పడ్డామని, చివరికి రోడ్డు రావడంతో తమ బాధలు తీరాయనుకుంటే నిత్యం వందలాటి ట్రాక్టర్ల రాకపోకలతో రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇసుక తరలించేందుకు వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకొని 3 గంటల పాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి రూరల్‌సీఐ అఫ్జలోద్దిన్, నెన్నెల ఎస్ఐ శ్యాంపటేల్సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్తామని, అంతవరకు ఓపికపట్టాలని గ్రామస్తులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.