
హైదరాబాద్ లో తాగుబోతులు రోజు రోజుకూ పేట్రేగి పోతున్నారు. గంజాయి, డ్రగ్స్, మద్యం.. సేవించి కాలనీలో, విల్లాల్లో చొరబడుతూ నానా హైరానా చేస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లను సినిమాలో విలన్ల మాదిరిగా చితక్కొడుతున్నారు. మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న సంగతి కూడా మరిచి రాక్షసంగా ప్రవర్తిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం తాగుబోతులు చేసిన వీరంగం చూస్తే ఎలా చెలరేగుతున్నారో అర్థం అవుతుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూరపల్లి లోని అయోధ్య విల్లాస్ లో తాగుబోతుల విచ్చలవిడిగా ప్రవర్తించారు. తెల్లవారు జామున 5 గంటలకు అయోధ్య విల్లాల్లోకి చొరబడి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన మహిళలు, స్థానికుల పై బూతు పురాణం అందుకున్నారు.
అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు ను చితకబాదారు. రౌడీల్లా కాళ్లతో తంతూ పిడిగుద్దులు గద్దారు. ఒకరు పట్టుకుంటే ఇంకొకరు సెక్యూరిటీని ఘోరంగా చావబాదారు. ఎంత బతిమాలినా మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ పిచ్చ కొట్టుడుకొట్టి పరారైనారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించారు. నిందితులు సూరారం కాలనీకి చెందిన మన్నే బాలేష్, వారాల నర్సింహ వారసులు అజయ్, నితిన్, లాలూ, తిరుమలేష్ గా గుర్తించారు.
విల్లాలో వీళ్లు చేసిన బీభత్సానికిమహిళలు,కాలనీ వాసులు భాయాందోళనలో ఉన్నారు. డ్రగ్స్ తీసుకుని హల్చల్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డును తీవ్రంగా దాడి చేయడంతో నేపాల్ కు చెందిన సెక్యూరిటీ గార్డు అసోసియేషన్ సభ్యులు ఏకమయ్యారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.