ప్రజా గొంతుకగా నిలిచాం...అరుణోదయ 50 వసంతాల సభలో విమలక్క

ప్రజా గొంతుకగా నిలిచాం...అరుణోదయ 50 వసంతాల సభలో విమలక్క
  • ఉద్యమంతో అనేక సమస్యలపరిష్కారానికి కృషి చేశామని వెల్లడి  

ముషీరాబాద్, వెలుగు: నక్సల్బరి ఉద్యమ ప్రేరణతో పురుడు పోసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ప్రజా గొంతుకగా నిలిచిందని ఆ సంస్థ చైర్ పర్సన్ విమలక్క అన్నారు. అరుణోదయ సమాఖ్యకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండో రోజు జరిగిన ముగింపు సభలో ఆమె మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదుల మీద తమ ఉద్యమం సాగిందని, ఈ 50 ఏండ్లలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు.

నిర్బంధాలు, అరెస్టులకు ఎదురొడ్డి ప్రజల గొంతుకగా నిలిచి సమస్యలపై పోరాటం చేశామన్నారు. హిందూ ఫాసిజం, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని విమలక్క స్పష్టం చేశారు. సమావేశంలో అంబటి నాగయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదపు సంస్కృతి దాడిలో భాగంగా నేటి వస్తువుల వ్యవస్థ డిస్పోజల్ వ్యవస్థగా మారిందన్నారు. అది ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత ప్రాచీనమైన మన సంస్కృతిపై బ్రాహ్మణీయ భావజాలం, ఫాసిజం పేరుతో దాడి జరుగుతోందని ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు.

ఇలాంటి దాడిని ప్రతిఘటించడంలో అరుణోదయ వంటి సంస్థలు కీలకంగా పని చేస్తున్నాయన్నారు. రచయిత్రి జూపాక సుభద్ర మాట్లాడుతూ.. యువతలో మతతత్వం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. యువతలో సానుకూల భావాలు పెరిగేలా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, శనివారం సుందరయ్య పార్క్ నుంచి ఎర్రజెండాల రెపరెపలతో వీఎస్టీ ఫంక్షన్​హాల్​వరకు ర్యాలీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించగా.. ఆదివారం డప్పు డోలు, గుస్సాడీ, కోలాటం, ఒగ్గు డోలు తదితర సాంప్రదాయ నృత్యాలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వేడుకలు ముగించారు. కార్యక్రమానికి మల్సూర్, భాస్కర్ నాయక్, మోత్కూరు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణోదయ సావనీర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో  కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.