ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సెనా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, వినయ్ కుమార్ తో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. గతంలో ఎల్జీగా ఉన్న అనిల్ బైజల్ వ్యక్తిగత కారణాలతో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో వినయ్ కుమార్ సక్సెనా బాధ్యతలు చేపట్టారు. సక్సెనా ఎల్జీగా బాధ్యతలు చేపట్టక ముందు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.
Delhi | Vinai Kumar Saxena takes oath as Lieutenant Governor of Delhi pic.twitter.com/cDEYu7uMIB
— ANI (@ANI) May 26, 2022
ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్ కుమార్ 1958 మార్చి 23న జన్మించారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి రాజస్థాన్‌లోని జేకే గ్రూప్‌లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించారు. వివిధ హోదాల్లో 11 ఏళ్లు పనిచేసిన అనంతరం 1995లో గుజరాత్ పోర్ట్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఈఓగా పదోన్నతి పొందారు. 2015 అక్టోబర్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు.