ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ నెల 20న జరిగే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్‌లో కార్నర్ మీటింగ్ పై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఆర్మూర్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఏ ఒక్కరికి ఇల్లు కట్టివ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూయిస్తానన్నారు. ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబా గౌడ్, పీసీసీ అడ్వైజరీ కమిటీ మెంబర్ కోల వెంకటేశ్, కొంతం మురళీధర్, దొండి రమణ, సైవే రాజు, జిమ్మి రవి పాల్గొన్నారు.