వినాయకుడు... పిల్లలకు మార్గదర్శకం.. ఎలాగంటే...

వినాయకుడు... పిల్లలకు మార్గదర్శకం.. ఎలాగంటే...

గణపయ్య అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా..!మరి ఆయనకు రోజు  పూజలు చేయడమే కాదు.. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. గణపతి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మనం కూడా అలాగే తయారవ్వాలి. అందుకే.. పిల్లలూ ఒకసారి వినాయకుడిని తీక్షణంగా చూడండి. ఆయన్నుంచి మనం అందుకోవాల్సిన ఆదర్శవంతమైన గుణగణాలు కానుకగా ఇస్తాడు. అవన్నీ సక్సెస్ మంత్రాలే! 

శివుడు ఓసారి వినాయకుడిని, అతని తమ్ముడు కుమారస్వామిని మూడుసార్లు ప్రపంచాన్ని చుట్టి రమ్మంటాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద ప్రయాణం మొదలుపెడతాడు. వినాయకుడిదేమో ఎలుక వాహనం. అది వేగంగా పోలేదు కదా! 

కొద్దిసేపు ఆలోచించి.... వెంటనే తన తల్లిదండ్రుల చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. ఎందుకు అలా చేశాడో తెలుసా? ఎందుకంటే అతని దృష్టిలో తల్లిదండ్రులంటేప్రపంచం. వాళ్లంటే ఆయనకు భక్తి, ప్రేమ, గౌరవం. సంక్షోభ సమయంలో కొత్తగా ఎలా ఆలోచించాలో.. ఈ సంఘటనలో మనకు చెప్తాడు వినాయకుడు. 

సమస్య దగ్గరే ఆగిపోకుండా వెంటనే దానికి పరిష్కారం కనుక్కొన్నాడు. ఇన్నోవేటివ్ గా ఉండాలని ఆయన పరోక్షంగా చెప్తున్నాడు. అంతేకాదు... మనలో ఎవరూ దేవుడ్ని చూడలేదు. కానీ, తల్లిదండ్రులే దేవుడికి ప్రతిరూపాలు. వాళ్లు మనల్ని ప్రేమిస్తారు. మనకోసం ఆరాటపడతారు. కానీ, మనం వాళ్లను నెగ్లెక్ట్ చేస్తాం. తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండనే సందేశాన్ని వినాయకుడు మనకిస్తున్నాడు. కాబట్టి, వినయంగా ఉంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి.

పెద్ద చెవులు

ఎప్పటికైనా మంచి శ్రోతే.. గొప్ప జ్ఞాన సంపన్నుడు కాగలడు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నా... ఒక విషయాన్ని సంపూర్ణంగా
నేర్చుకోవాలన్నా.. ముందు మంచి శ్రోతగా మారాలి. వినాయకుడి పెద్ద చెవులు అదే చెప్తున్నాయి. ఎవరు ఏం చెప్పినా ముందు వినాలి. అది మన దగ్గరున్న సమాచారాన్ని విశ్లేషించుకోవడానికి.. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

తొండం

వినాయకుడి తొండం ఎటంటే అటు వంగుతుంది. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ కావాలని ఇది మనకు నేర్పిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారినవాళ్లనే విజయం వరిస్తుంది.

చిన్న కళ్లు

చేస్తున్న పనిపైనే ఫోకస్ పెట్టాలి. అవసరం లేని విషయాల గురించి బాధపడకూడదు. ఈ విషయాన్ని చిన్నగా ఉండే వినయాకుడి కళ్లు చెప్తున్నాయి. వినాయకుడి కళ్లు కాన్సట్రేషన్కి సింబల్.పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు ఉండాలని వినాయకుడి పెద్ద తలచెప్తుంది. ఏం తిన్నా జీర్ణం చేసుకోవాలి. మంచి, చెడుని కూడా జీర్ణం చేసుకోవాలని వినాయకుడి పెద్ద పొట్ట సూచిస్తుంది. తక్కువగా మాట్లాడమని వినాయకుడి చిన్న నోరు చెప్తుంది. కష్టపడి పని చేస్తే లభించే రివార్డులే లడ్డూలు, ఆయన ముందు ఉండే ప్రసాదం.. సంతోషాన్ని, ఆహారాన్ని అందరం షేర్ చేసుకోవాలని చెప్తుంది. ఇక పెద్ద శరీరం ఉండే వినాయకుడు చిన్న ఎలుకపై ప్రయాణిస్తాడు. ఇది చిన్న ప్రాణి పట్ల కూడా గౌరవభావంతో ఉండాలని సూచిస్తుంది.

నాయకుడు

దేవుళ్లందరిలో... వినాయకుడు ప్రత్యేకమే కాదు.. ఇండిపెండెంట్ కూడా. ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. గణపతి అంటే గణానికి అధిపతి, అంటే దేవుళ్ల సమూహానికి ఆయన అధిపతి! లీడర్షిప్ స్కిల్స్ ఉన్నప్పుడు లక్ష్యాలను అందుకోవడం తేలికవుతుందని ఈ విధంగా ఆయన మనకు సందేశమిస్తున్నాడు. లీడర్​ షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్లే.. లక్ష్యాలను సాధించడానికి అనేక దారుల్లో ప్రయత్నించగలుగుతారు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలుగుతారు. ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది మన దారిలో ఎదురొచ్చే కష్టాలను ఎదుర్కొని గమ్యం చేరుకోవ డానికి ఉపయోగ పడుతుంది.