వినాయక చవితి పండుగ: ప్రకృతి అంతా ఇంట్లోనే…

చెరువులో  పూడిక  తీయడం కోసం మట్టిని తీస్తాం. అలా తీసిన మట్టితో వినాయకుడి  విగ్రహాన్ని తయారు చేసుకుంటాం. తొమ్మిదిరోజుల పాటు పూజలు చేస్తాం. మళ్లీ అదే చెరువులో గణపతిని నిమజ్జనం చేస్తాం. చెరువు మట్టిని మళ్లీ  జాగ్రత్తగా చెరువుకే  అప్పగించేస్తాం. కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకునే వినాయక నిమజ్జనం లో అంతర్లీనంగా పర్యావరణ సోయి దాగి ఉందనడానికి  ఇదే నిదర్శనం.

ప్రకృతి సంబురం

చవితిని కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే   వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది.ఆకులు, పూలతో  చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ సీజన్ లోనే దొరికే కొన్ని  పువ్వులుంటాయి. వినాయకుడి కోసమేనా అన్నట్టుంటాయవి. ఇలా ఆకులు, పువ్వులు, పండ్లు….అన్నీ  ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి  ప్రత్యేకంగా అందించిన 21రకాల పత్రి, గరికతో గణనాధునికి పూజలు చేస్తాం.  చెరకుగడలు, వెలగపండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు ఇటు పూలు పండ్ల  మధ్య కొలువైన గణపతిని చూస్తే ఈ ప్రకృతిలో  మనమూ భాగమేనన్న అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజ ను  ప్రకృతి సంబురంగానే  చూడాలి.

ఆకులు అలముల్లో ఔషధ గుణాలు

ప్రకృతి సహజంగా దొరికే ఆకులు అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల రోగాలకు  ఇవి మందుగా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకుల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. రోగాలొచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

పచ్చికాయలే  వినాయకునికి నివేదన

భాద్రపద మాసంలో పంటలన్నీ కాయల రూపంలోనే ఉంటాయి. ఆ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం. ‘‘ ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి ”అనే సందేశం గణపతి పూజలో ఉంది. పూజల్లో భాగంగా చేసే హోమంలో , ఎండిన ఔషధ మొక్కల బెరళ్లను, కాండాలను సమర్పిస్తాం. వీటిని సమర్పించినప్పుడు  పొగ పైకి వెళ్లి మేఘాలను కదిలిస్తుంది. ఫలితంగా బాగా  వానలు పడతాయన్నది ఒక నమ్మకం. ఇలా వినాయక పండగలో అడుగడుగునా మనం ఇప్పుడు మాట్లాడుకునే  ఎన్నో సైంటిఫిక్ అంశాలు ఇమిడి ఉన్నాయి.

ఏడాదికేడాది పెరుగుతోన్న  మంటపాలు

గతంలో పట్టణాలు, నగరాల్లో మంటపాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో మంటపాలు పెడుతున్నారు. ప్రతి ఏడాది కొత్త కొత్త మంటపాలు ఏర్పాటవుతున్నాయి. చిన్నారులు కూడా మంటపాల్లో కనిపిస్తున్నారు. మన సంప్రదాయలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుంటున్నారు. ఇది నిజంగా సంతోషించదగ్గ మార్పే.

పట్టణాలు, నగరాల్లో  సహజంగా అపార్ట్ మెంట్ల కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి ఫ్లాట్ లో వారుంటారు. ఎవరి ప్రపంచం వారిదే. ఉరుకుల పరుగుల జీవితంలో  ఒకే అపార్ట్​ మెంట్లో ఉన్నా  అందరికీ కనీస పరిచయాలు కూడా ఉండవు. కానీ పండుగ వస్తోందనగానే అపార్ట్ మెంట్ ఆవరణలో మంటపం పెడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మంటపం దగ్గర అపార్ట్ మెంట్లో ఉండే వాళ్లంతా ఒకరికొకరు కలుసుకోవడం, మంచీచెడూ మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఒకరి ఆలోచనలను మరొకరితో షేర్ చేసుకుంటున్నారు. కనీసం వినాయక ఉత్సవాల పుణ్యంతోనైనా ఒకరితో మరొకరికి పరిచయాలు పెరుగుతున్నాయి. ఈ కోణంలో నుంచి చూస్తే  నవరాత్రి ఉత్సవాలు ఓ సాంఘిక సంబురం కూడా.

నిమజ్జనంలోనూ….

విఘ్నరాజుకు ప్రకృతితో ఉన్న అనుబంధం అక్కడితో ఆగలేదు. నవరాత్రుల తర్వాత వినాయకుడి విగ్రహాలను  చెరువుల్లోనూ, నదుల్లోనూ, సముద్రంలోనూ నిమజ్జనం చేయడం కూడా ఈ అనుబంధాన్ని సూచిస్తుంది. ఇప్పుడంటే  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడు అన్నీ మట్టి విగ్రహాలే కనుక నీళ్లల్లో కరిగిపోయేవి. ఇప్పుడు మళ్లీ అందరూ మట్టి విగ్రహాల వైపు మళ్లుతుండటం శుభసూచకమే. పూజకు వాడిన పువ్వులు, ఆకులు, పండ్లు కూడా నీళ్లలో చేరడం అంటే ప్రకృతిలో లీనమైనట్టే .

కలిసి ఉండాలన్న సందేశం

ఎవరికి వారుగా బతికే  ఊరి ప్రజలను ఐక్యంగా ఉంచడమనే సందేశం వినాయక నవరాత్రుల్లో ఉంది. వినాయకుడి విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంతవరకు తొమ్మిదిరోజుల పాటు జనం అంతా ఒక చోట గుమికూడతారు. నవరాత్రుల సందర్భంగా పల్లెటూళ్లలో  జడకొప్పు  కోలాటం, చెక్క భజన వంటి ఎన్నో కళారూపాలు ప్రదర్శిస్తారు. ఎటు చూసినా కళాకారుల విన్యాసాలతో  పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. వినాయక చవితి వస్తోందంటేనే కళాకారుల ఆనందానికి అడ్డు ఉండదు. నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల పాటు చేతినిండా పని ఉంటుంది. భుక్తికి ఎలాంటి లోటుండదు.

జాతీయ భావం రగిల్చేందుకు వినాయక ఉత్సవాలు

మనకు ఎన్నో పండుగలున్నాయి. ప్రతి పండుగకు  ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.అయితే గణపతి నవరాత్రులకు ఒకటి కాదు…రెండు కాదు అన్నీ  ప్రత్యేకతలే. పర్యావరణం గురించి మనం ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ కొన్ని వందల ఏళ్ల కిందటే మన పెద్దవాళ్లు పర్యావరణం గురించి ఆలోచించారు. గణపతి ఉత్సవాల్లో అంతర్లీనంగా ప్రకృతిని భాగం చేశారు.

– డాక్టర్ సరోజ వింజామర, టీచర్, హెచ్ పీఎస్ ( బి)