వినాయక చవితి.. విఘ్నేశ్వరుని కథ వినాల్సిందే..

వినాయక చవితి.. విఘ్నేశ్వరుని కథ వినాల్సిందే..

పూర్వం గజరూపము గల రాక్షసేశ్వరుడు శివునిగూర్చి ఘోర తపస్సు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి ‘స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించి యుండు’ అని కోరినాడు. భక్తసులభుడగు ఆ మహేశ్వరుండు ఆ కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలోనికి ప్రవేశించి సుఖంబుండై ఉండె. కైలాసమున పార్వతీదేవి.. భర్తజాడ తెలియక పలుతెరంగుల అన్వేషించినది. కొంత కాలమునకు గజాసురుని గర్భంలో ఉన్నట్టుగా తెలుసుకొని వెలుపలకు రప్పించుకును మార్గము తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపినది. 

నా పతిని రక్షించి నాకొసగితివి...

‘ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకొసగితివి. ఇప్పుడు కూడా ఏదేని ఉపాయముతో రక్షింపు’మని విలపించగా, పార్వతిని హరి ఊరడించి పంపినాడు. తదుపరి హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే సరియైనదని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాది దేవతలతో తలకొక వాయిద్యమును ధరింపచేసి, తానునూ చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసురపురంబు జొచ్చి, జగన్మోహనంబుగా నాడించుచుండెను. గజాసురుడు ఈ విషయము విని, వారలను పిలిపించి తన భవనము ఎదుట ఆడించ నియమించెను. బ్రహ్మాది దేవతల వాద్యవిశేషంబులు జోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దునాడించగా గజాసురుడు పరమానంద భరితుడై “మీకేమి కావలయునో కోరుకొనుడు. ఇచ్చెదను’’ అనగా, హరి సమీపించి, “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చెను కనుక శివునొసంగు” మని పల్కె. 


రాక్షసాంతకుడగు శ్రీహరిగా గుర్తించి...

ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గుర్తించి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్తుండగు పరమేశ్వరునితో “నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మమును నీవు ధరింపవలె”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి అంగీకారము తెలిపెను. అంతట హరి, నందిని ప్రేరేపింప నంది తన శృంగములతో గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి వెలుపలికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించె, అంతట హరి “దుష్టాత్ముల కిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని’’ ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి, తానును వైకుంఠమునకేగెను. శివుడు నందినెక్కి కైలాసంబుకు అతివేగమున బయలెల్లెను.

ALSO READ:  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్రు : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

వినాయకోత్పత్తి...

కైలాసంబున పార్వతి భర్త రాకను దేవాదులు చెప్పగా విని ముదమంది అభ్యంగ స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుని చేసి, ప్రాణము పోసి, వాకిలి ద్వారమున కాపుంచె. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని పతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంతట పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి, లోపలికి పోబోవ ప్రయత్నించగా, ద్వారమందున్న బాలకుడడ్డగించె. కోపావేశుడైన శివుడు త్రిశూలముతో ఆ బాలకుని కంఠంబు దునిమి లోనికి నడిచె. పార్వతీ దేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించె. వారిరువురును ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారము వద్ద కాపు ఉంచిన బాలుని ప్రసంగము వచ్చె. అంతట మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణం పోసినాడు. గజాననుడు అని నామంబొసంగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమా మహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించు చుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. - కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జన్మించె. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచియుండెను.

వినాయకాధిపత్యం... 

ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించి, విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమ కొసంగమనిరి. గజాననుడు పొట్టివాడు కనుక ఆ ఆధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొనెను. “మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా వచ్చెదరో వారికే ఆధిపత్యం బొసంగుదునని” మహేశ్వరుడు పలుకగా, సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబెక్కి వాయువేగంబున నేగె. గజాననుండు తండ్రిని సమీపించి ప్రణమిల్లి “నా అసమర్థత తామెరింగియు ఈ విధంగా పరీక్షించుట తగునే. మీ పాదసేవకుండనగు నా యందు కటాక్షముంచి తగు ఉపాయంబు దెల్పి రక్షింపవలె” అని ప్రార్థించెను. మహేశ్వరుండు దయాళుడై “సకృన్నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం। గంగాది సర్వతీర్దేషు స్నాతోభవతి పుత్రక ।।


ఒక్కసారి నారాయణమంత్రము జపించిన...

కుమారా! ఒక్కసారి నారాయణమంత్రము జపించిన మాత్రమున మూడు వందల కల్పముల పుణ్య నదులలో స్నానమొనర్చిన వారవుతారు” అని తెలిపి సక్రమంబుగ మంత్రమును ఉపదేశించగా గజాననుడు ఆ మంత్రమ్ము జపించుచు కైలాసంబుననుండె. మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కనిపించె. ఈ విధముగనే మూడుకోట్ల ఏబది లక్షల నదులలో స్నానమాడిన తదుపరి కూడా అట్లే జరిగినది. ఇది చూచి కుమారస్వామి, కైలాసంబునకేగి తండ్రి సమీపమందున్న గజాననునిగాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లంటిని. క్షమించుము. ఈ ఆధిపత్యమ్ము అన్నగారికే యొసంగు”డని ప్రార్థించె. 

భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి ఆధిపత్యం...

అంతట పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి ఆధిపత్యం బొసంగెను. ఆనాడు అందరూ విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, ఉండ్రాళ్లు వంటి పిండివంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించినారు. అంతట విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కేగి, తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయి కడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు వినాయకుని జూసి వికటంబుగా నవ్వె. అంతట “రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు”నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లెను. అతండును మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని చూచి, “పాపాత్ముడా! నీ దృష్టి దగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక!” అని శపించెను.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఇదే సమయమున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపజయంబున అశక్తుడై క్షీణించుచుండ, ఆ విషయము భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపమ్ములు తానే దాల్చి పతికి ప్రియంబు సేయ, ఋషులు అది జూసి, అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలేనని శంకించి, తమ తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఆ విషయము తెలియజేయగా అతడు సర్వజ్ఞుడగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చెననే సత్యమును సప్తఋషులకు తెలియజేసి, వారిని సమాధానపరచి వారితో కూడ బ్రహ్మకైలాసమున కేతెంచి ఉమామహేశ్వరుల సేవించి, మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవాదులు “పార్వతీ దేవీ! నీ వొసంగిన శాపంబు లోకంబులకు కీడు వాటిల్లును గాన దానిని ఉపసంహరింపుము’’ అని ప్రార్థింప, కుమారుని పార్వతి జేరదీసి ముద్దాడి “ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో, ఆ దినంబున చంద్రుని చూడరాదు” అని శాపవసానం బొసంగె. అంత బ్రహ్మాదులు, సంతసించుచు తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్ధియందు మాత్రమే చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.