
విఘ్నాలు తొలగించే వినాయక చవితి పండుగను జరుపుకొనేందుకు ప్రజలకు విఘ్నాలు తప్పడం లేదు. ఒక్కో క్యాలండర్ లో ఒక్కో విధంగా వినాయకచవితి పండుగను పేర్కొన్నారు. 2023 వ సంవత్సరంలో అధికమాసం ఏర్పడటం వల్ల పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడింది... ఏరోజు ఏ పండుగ వస్తుందో జనాలకు అర్దం కావడం లేదు. ఒకరు ఒక పండుగ అంటే మరొకరు అదే పండుగ ఇంకో రోజంటున్నారు. దీంతో ప్రజలు అసలు ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక గందరగోళ స్థితిలో ఉన్నారు. . పండగ ఘడియలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది కొంత గందరగోళం నెలకొంది. తిథులు, పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండుగ, శుభ ఘడియలు రెండు రోజుల పాటు ఉంటోన్నాయి. రాఖీ పండుగ కూడా అలానే రెండు రోజులు వచ్చింది. అలాగే కృష్ణాష్టమి కూడా రెండు రోజులు జరుపుకోవచ్చని పండితులు సూచించారు. ఇక ఇప్పడు వినాయచవితి పండుగ విషయంలో నానా రచ్చ జరుగుతుంది. దీనికి తోడు ఒక్కో రాష్ట్రం ఒక్కో రోజు వినాయకచవితి సెలవు ప్రకటించింది. దీంతో వినాయకచవితి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు దేశ ప్రజలు. అందులో వినాయక చవితి పండుగను ప్రతి గల్లీలో మండపాలు పెట్టి నిర్వహిస్తారు. ఈ పండుగను తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు. ఏ రోజు మొదలు పెట్టాలో తెలియక ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజించే వినాయక చవితిది తెలుగువారి పండగల్లో విశిష్టస్థానం. వ్యక్తిగతంకానే కాక సామూహికంగానే నిర్వహించుకునే ఈ వేడుకకు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈసారి వినాయక చవితి ఏ తేదీన వచ్చిందన్నది ఇప్పుడు అతి పెద్ద టాపిక్. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్ 18 అని ఉంటే.. మరికొన్నింటిలో సెప్టెంబర్ 19న వినాయక చవితి అని ఉండటం గణేశ్ భక్తులను గందరగోళానికి దారి తీసింది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు సెలవు
తమిళనాడు ప్రభుత్వం వినాయకచవితి హాలిడేను సెప్టెంబర్ 17 అని అధికారికంగా ప్రకటించింది. అసలు ఆ రోజున చవితి గడియలు లేవంటున్నారు పండితులు. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే సెప్టెంబర్ 19న వినాయకచవితి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18న హాలిడే ప్రకటించారు.
18నే అంటున్న తెలంగాణ విద్వత్సభ
వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఏర్పడిన సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ ఇచ్చింది. గణేశ్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? 19వ తేదీన నిర్వహించాలా అనేది కొద్దిరోజులుగా ప్రజల్లో ఓ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ విద్వత్సభ.. భాద్రపద శుక్ల చతుర్థి అయిన సోమవారం ( సెప్టెంబర్ 18వ తేదీన ) వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
19నే ప్రారంభం అంటున్న భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సెప్టెంబర్ 19 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పింది. ప్రభుత్వం చెబుతుంది కదా ఇదే తేదీ ఖరారవుతుందా అంటే మళ్లీ డౌటే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖమైన ఖైరతాబాద్ గణేషుడికి 19నే చవితి ఉత్సవాలు ప్రారంభిస్తామని నిర్వాహకులు మంత్రి సమక్షంలోనే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అసలు చవితి ఎప్పుడు, అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పండితులు ఏమంటున్నారు...
ప్రతి ఏడాది బాద్రపద మాసం శుక్ల పక్షం చవితి గడియల్లో వినాయకచవితి పండుగను జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2023) అధికమాసం రావడంతో ఒక్కో తిథి రెండు రోజులు వచ్చింది. చతుర్థి తిథి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 1:43 గంటలకు ముగుస్తుంది. అయితూ సెప్టెంబర్ 19న ఉదయం 11:01 నుండి 1 గంటల వరకు జరిగే మధ్యాహ్న ముహూర్తంలో గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు.