- బల్క్ బుకింగ్‌లతో ఒక్కసారిగా పెరిగిన రేట్లు
- ఉత్సవ కమిటీలకు ఫ్రీగా సప్లై చేస్తున్న ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావహులు
- నిరుడితో పోలిస్తే ఈసారి విగ్రహాల ధరలు రెండింతలు
- ముడిసరుకుల రేట్లు పెరగడంతోనేధరలు పెంచాం: వ్యాపారులు
మహబూబాబాద్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఎన్నికల వాతావరణం కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు యూత్ మద్దతు పొందడానికి యత్నిస్తున్నారు. యువకుల ఓట్లకు గాలం వేయడానికి గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు వినాయక విగ్రహాలను సమకూరుస్తున్నారు. ఇందు కోసం విగ్రహ తయారీ కేంద్రాల్లో ఆయా పార్టీల నేతలు గణపతి ప్రతిమలను ముందే బుక్ చేసుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే భక్తులకు ఉచితంగా విగ్రహాలు ఇవ్వడంతో పాటు మండపాలు కూడా ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అధికార పార్టీ మ్మెల్యేలు, ఆశావాహులు గ్రామాల వారీగా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నారు. ఇందు కోసం ముందుగానే బల్క్ లో ఆర్డర్లు ఇచ్చారు. అలాగే మిగతా పార్టీల నేతలు కూడా విగ్రహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వ్యాపారుల వద్ద వారు కూడా బల్క్‌లో బుకింగ్‌లు చేసుకున్నారు. దీంతో దొరికిందే సమయం అన్నట్లు వ్యాపారులు వినాయక విగ్రహాల రేట్లను ఒక్కసారిగా పెంచేశారు. ఈ ధరల పెరుగుదల ప్రభావం మిగతా వారిపైనా పడుతున్నది. గణపతి విగ్రహాల కొనుగోలు కోసం వెళ్లినవారు రేట్లు విని షాక్ అవుతున్నారు. నిరుడి కన్నా ఈసారి ప్రతి విగ్రహంపై 70 శాతం రేట్లను వ్యాపారులు పెంచేశారు. అయితే, విగ్రహాలను తయారు చేయడానికి వాడే ముడి సరుకుల రేట్లు పెరగడం వల్లనే విగ్రహాల రేట్లు పెంచామని వ్యాపారులు చెబుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ లో గణపతి ప్రతిమల తయారీ కొనసాగడంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు వర్ధన్నపేట, తిరుమలగిరి, నెల్లికుదురు, మరిపెడ, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి భక్తులు విగ్రహాల కొనుగోలుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. పెద్ద విగ్రహం ధర రూ.70 వేలుపైనే ఉండగా.. చిన్నచిన్న విగ్రహాలు సైతం రూ.4 వేల నుంచి ధర పలుకుతున్నాయి. 5 ఫీట్ల విగ్రహం ధర గత ఏడాది రూ.4 వేలు ఉంటే ప్రస్తుతం రూ.9 వేలు, 8 అడుగుల విగ్రహం ధర రూ.8 వేల నుంచి రూ.15 వేలు, 12 అడుగుల ప్రతిమ రూ.20 వేల ధర పలుకుతున్నాయి. ఇక భారీ విగ్రహం ధర రూ.70 వేలకుపైనే ఉంది. భక్తులకు విగ్రహాలు సమకూర్చేందుకు రాజకీయ పార్టీల నేతలు ముందుకు రావడం, ముడిసరుకుల ధరలు బాగా పెరగడం వంటి కారణాల వల్ల ఈసారి గణపతి విగ్రహాల ధరలు బాగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఫీటుకు రూ.2 వేలు పెంచారు
గణపతి విగ్రహాల రేట్లు గతంతో పోలిస్తే ఈ ఏడాది డబుల్ అయ్యాయి. గతంలో రూ.10 వేలు వెచ్చిస్తే 15 ఫీట్ల విగ్రహం దొరికేది. కానీ, ఈసారి ఫీటుకు రూ.2000 పెంచడంతో రేట్లు రెండింతలయ్యాయి. విగ్రహాల రేట్లతో పాటు మండపాల నిర్వహణ, పూజా సరుకుల రేట్లు ఇలా అన్ని ధరలు గతంలో కన్నా బాగా పెరిగాయి. ఈ ఏడాది గణపతులను ప్రతిష్టించాలంటే ఇబ్బందిగానే ఉంది.
- కడారి సాయి, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్
రేట్లు పెరిగినా అమ్మకాలు బాగున్నయ్
గణపతి విగ్రహాల రేట్లు గత ఏడాది కన్నా ఈసారి 70 శాతం పెరిగాయి. విగ్రహల తయారీ షెడ్ల నిర్వహణ, తయారీదారులు, కూలీల రేట్లు, రవాణా చార్జీలు పెరగడంతో విగ్రహాల రేట్లు పెరిగినయ్. గతంలో కరోనా వల్ల బిజినెస్ దెబ్బతిన్నది. ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు ముందుగానే విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు. మేము 12 చోట్ల విగ్రహాలను తయారుచేసి రెడీగా ఉంచాము. ఎలక్షన్ ఇయర్ కావడంతో రేట్లు పెంచక తప్పలేదు. ధరలు పెంచినా విక్రయాలు తగ్గడం లేదు. ఇప్పటికే సగంకు పైగా బుక్ అయ్యాయి. ఈనెల 18 వరకు పూర్తిగా విగ్రహాలు అమ్ముడుపోతాయి. సీజన్లోనే కదా డబ్బులు వచ్చేది.
- దాసరి మనోజ్ కుమార్, వినాయక విగ్రహాల విక్రయదారు, తొర్రూరు