గణపయ్య పండుగ అంటే ఒక్కరోజులో అయిపోయేది కాదు. దసరా లెక్క ఇది కూడా నవరాత్రుల పండుగ, అయితే ఈ పండుగకు పూజలొక్కటే కాదు... ప్రసాదాలూ స్పెషలే, తీరొక్క స్వీట్ తో ప్రసాదాలు పెట్టి బొజ్జ గణపయ్యను పూజిస్తారు భక్తులు. చవితి మొదలుకొని విమజ్జనం రోజు వరకు... వినాయకుడికి ఏరోజు ఎలాంటి స్వీట్ పెట్టాలని ఆలోచించే వాళ్లు ఇలా ప్రసాదాలు తయారు చేసుకోండి. . . బోలో గణేశ్ మహరాజ్ కీ... జై!".
కోవా మోదక్ తయారీకి కావాల్సినవి
- కోవా తురుము ..ఒకటిన్నర కప్పు
- చక్కెర లేదా బెల్లం తురుము ...అర కప్పు
- ఇలాచీ పొడి ..పావు టీ స్పూన్
- నెయ్యి..ఒకటీ స్పూన్
తయారీ విధానం: స్టవ్ పాన్ పెట్టి వేడి చేయాలి. మంట చిన్నగా చేసి కోవా వేయాలి. అది కరగడం మొదలయ్యాక చక్కెర వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఇలాచీ పొడి వేయాలి. మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని నెయ్యి రాసిన మోదక్ మౌల్ట్స్ లో పెట్టాలి. కొద్దిసేపయ్యాక వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి.
పెసరపప్పు హల్వా తయారీకి కావాల్సినవి
- పెసరపప్పు... ఒక కప్పు
- నెయ్యి.... ముప్పావు కప్పు
- చక్కెర.... ఒక కప్పు
- ఇలాచీ పొడి....చిటికెడు
- బాదంపప్పు తరుగు ....అర టేబుల్ స్పూన్
- జీడిపప్పు తరుగు ....అర టేబుల్ స్పూన్
తయారీ విధానం: పెసరపప్పులో సరిపడా నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత ఆ పప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో రుబ్బిన పిండి. అరకప్పు నెయ్యి వేసి కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి ఈ మిశ్రమం వేయాలి. నిమిషం తర్వాత మరో పావు కప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం పూసల్లాగా వచ్చేంతవరకు, నెయ్యి బయటికి కారుతోందని అనిపించేంత వరకు చిన్న మంటపై కలపాలి. తర్వాత చక్కెర పాకంలో ఈ మిశ్రమం వేసి కలపాలి. చివరగా చెయ్యిలో వేగించిన బాదం, జీడిపప్పు తరుగు, ఇలాచీ పొడి వేసి కలపాలి
బెల్లంతో మాల్ పువా తయారీకి కావలసినవి
- గోధుమ పిండి ... ఒక కప్పు
- బెల్లం తురుము.... 15 గ్రాములు
- సోంపు... అర టేబుల్ స్పూన్
- ఇలాచీ పొడి ...అర టేబుల్ స్పూన్
- నెయ్యి... ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:బెల్లం తురుమును ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో వేసి కరిగించాలి. తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి. నాన్ స్టిక్ పాన్ కు నెయ్యి రాసి పిండి మిశ్రమాన్ని చేసి గుండ్రంగా తిప్పాలి.కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. వీటిని పేపర్ నాఫ్కిన్ మీద వేస్తే అది నూనె పీల్చుకుంటుంది. వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి.
తాలికలు తయారీకి కావాల్సినవి
- బియ్యప్పిండి.. రెండు కప్పులు
- ఇలాచీ పొడి ..- రెండు టీ స్పూన్లు
- ఎండు కొబ్బరి తురుము ...- అర కప్పు
- బెల్లం తురుము లేదా చక్కెర -... ఒకటిన్నర కప్పు
- జీడిపప్పు తరుగు - ...ఒక టేబుల్ స్పూన్
- బాదంపప్పు తరుగు... - అర టేబుల్ స్పూన్
- పాలు-...మూడు కప్పులు
- కిస్ మిస్ లు ... -పన్నెండు
- నెయ్యి .... -సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో బియ్యప్పిండిని సరిపడా వేడి నీళ్లతో కలిపి ముద్దగా చేయాలి. ఆ పిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని తాలికలు చేయాలి . తాలికలతో కొన్ని ఉండ్రాళ్లు కూడా చేయొచ్చు, స్టవ్ పై పాన్ పెట్టి పాలు పోయాలి. అందులో బెల్లం తురుము లేదా... చక్కెర వేసి మరిగించాలి. అందులో పిండి తాలికలు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఆపైన ఎండుకొబ్బరి తురుము, నెయ్యిలో వేగించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.