భారత్, వియత్నాంల సంయుక్త సైనిక విన్యాసాలు విన్బాక్స్ 2024, అయిదో ఎడిషన్ హర్యానాలోని అంబాలాలో ప్రారంభమయ్యాయి. 2023లో వియత్నాంలో జరిగిన విన్యాసాలకు కొనసాగింపుగా విన్బాక్స్ 2024 విన్యాసాలు అంబాలా, చండీమందిర్ రెండు ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ విన్యాసాలు భారత్, వియత్నాంల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా కీలకం.
2024 విన్యాసాల్లో ఇరుదేశాల ఆర్మీతోపాటు వాయుసేన కూడా పాల్గొనడంతో కార్యక్రమం మరింత విస్తృతమైంది. భారత సైన్యం తరఫున రెజిమెంట్ కోర్ ఇంజినీర్లు 47 మంది సహా ఇతర విభాగాల సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీ బలగాలు సమాన సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రణాళికా పత్రం ఏడో అధ్యాయంలో భాగమైన ఐరాస శాంతి సంరక్షణ కార్యకలాపాల్లో ఇంజినీరింగ్ సేవలందించేందుకు, ఇరుదేశాల ఇంజినీర్ల, వైద్య సేవల బృందాలను ఈ విన్యాసాలు సిద్ధం చేస్తాయి.