Paris Olympics 2024: వినేశ్ ఫోగాట్‌కు నిరాశ.. అనర్హత వేటును సమర్ధించిన CAS

Paris Olympics 2024: వినేశ్ ఫోగాట్‌కు నిరాశ.. అనర్హత వేటును సమర్ధించిన CAS

ఉమ్మడి రజత పతక విజేతగా ప్రకటించాలని భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(CAS) తిరస్కరించింది. ఈ నిర్ణయంతో, దేశానికి మరో ఒలింపిక్స్ పతకం వస్తుందని ఆశిస్తున్న భారత అభిమానుల కల ఆవిరైంది. ఒలింపిక్స్‌ నియమాల ప్రకారం, భారత రెజ్లర్‌పై అనర్హత వేటు వేయడాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సమర్ధించింది. ఈ మేరకు CAS తన తీర్పును బుధవారం(ఆగస్టు 14) విడుదల చేసింది. 

భారత రెజ్లర్‌పై అనర్హత వేటు ఎందుకు..?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మహిళల వ్యక్తిగత 50 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో పాటీ పడింది. తొలిరోజు తన బరువును అదుపులో ఉంచుకొని మూడు బౌట్లలో తలపడి.. అన్నింటా విజయం సాధించింది. మరుసటి రోజు రాత్రి ఫైనల్ జరగాల్సి ఉండగా.. ఉదయం జరిపిన పరీక్షల్లో ఉండాల్సిన దానికంటే, 100 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు తేలింది. బరువు తగ్గించుకోవడానికి 15 నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. భారత రెజ్లర్ బరువు కోల్పోలేకపోయింది. దాంతో, నిర్వహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు.

వరల్డ్ నెం.1 ఓడించి..

పతకం కోసం వినేశ్ ఫోగాట్ ఇంతలా పోరాడటానికి కారణం ఆమె సాధించిన విజయాలు. భారత రెజ్లర్ మొదటి రోజు మూడు బౌట్లలో పోరాడి విజయం సాధించింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెం.1 రెజ్లర్ యుయ్ సుసాకి(జపాన్)‌ని ఓడిచింది. అనంతరం రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌ను మట్టికరిపించింది. ఆపై సెమీఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. మరికొన్ని గంటల్లో ఫైనల్ అనగా.. అనర్హత వేటు పతకాన్ని చేజార్చుకుంది.