
- పారిస్‌లోనే వేచి చూస్తున్న రెజ్లర్
- తీర్పు అనుకూలమంటున్న ఫొగాట్ లాయర్లు
పారిస్: యావత్ దేశం ఆతృతగా ఎదురుచూస్తున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత పిటీషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. స్పష్టమైన కారణాలు చెప్పకపోయినా.. శుక్రవారం తుది తీర్పు ఇస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (కాస్) మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలను విన్న కాస్ మంగళవారం తీర్పు వెలువరిస్తుందని దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ కాస్ మరోసారి వాయిదాకే మొగ్గు చూపింది. తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న వినేశ్ సోమవారం క్రీడా గ్రామం నుంచి బయటకు వచ్చినా ఇంకా పారిస్‌లోనే వేచి చూస్తోంది. వాదనలు పూర్తయినా.. తీర్పు వెలువరించడంలో జాప్యం చూస్తుంటే కాస్ నిర్ణయం వినేశ్‌కు అనుకూలంగా వస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ఆ లొసుగు వరం అవుతుందా?
తమ రూల్స్ ప్రకారం వినేశ్ ఫొగాట్‌ను ఫైనల్ బౌట్‌లో పాల్గొనేందుకు అనుమతించని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) తదుపరి మ్యాచ్‌ల్లో తమ నిబంధనలనే తుంగలో తొక్కింది. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం రెజ్లింగ్ టోర్నీల్లో ఫైనల్ చేరిన వ్యక్తి చేతిలో ఓడిన రెజ్లర్‌కు మాత్రమే రెపిఛేజ్ (కాంస్య పతక మ్యాచ్) పోటీలు ఆడే అవకాశం ఇస్తారు. అయితే, 50 కేజీ కేటగిరీలో అనర్హతకు గురైన తర్వాత నిబంధనల ప్రకారం వినేశ్‌కు చివరి స్థానం కేటాయించారు.
ఈ లెక్కన ఆమె ఫైనల్ చేరలేదు. కాబట్టి అంతకుముందు రౌండ్లలో ఆమె చేతిలో ఓడిన వారికి రెపిఛేజ్ అవకాశం ఇవ్వకూడదు. కానీ, ప్రిక్వార్టర్స్ బౌట్‌లో ఫొగాట్ చేతిలో ఓడిన సుసాకిని రెపిఛేజ్ రౌండ్‌కు అనుమతించగా.. ఆమె చివరికి కాంస్య పతకం గెలుచుకుంది. వినేశ్ చేతిలో సెమీస్‌లో ఓడినప్పటికీ ఆమెపై వేటు పడటంతో గుజ్‌మన్ ఫైనల్ చేరుకుంది. రూల్ ప్రకారం గుజ్‌మన్ చేతిలో తొలి రౌండ్‌లో ఓడిన టర్కీ రెజ్లర్ ఎవిన్ డెమిర్హాన్ కు రెపిఛేజ్ చాన్స్ ఇవ్వాలి. అలా కాకుండా అనర్హురాలిగా మారి, చివరి స్థానానికి పడిపోయిన వినేశ్ చేతిలో ఓడిన సుసాకికి రెపిఛేజ్ ఇచ్చి యూడబ్ల్యూడబ్ల్యూ తమ నిబంధనలనే ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది వినేశ్ కేసులో తుది తీర్పును ప్రభావితం చేసే చాన్స్ ఉంది.
ఫొగాట్ రియల్ ఫైటర్: శ్రీజేష్
విమెన్స్ 50 కేజీల్లో ఫైనల్ చేరిన వినేశ్ కచ్చితంగా పతకానికి అర్హురాలని ఇండియా హాకీ మాజీ గోల్ కీపర్ పీఆర్. శ్రీజేష్ అన్నాడు. ఇలాంటి సంఘటన తనకు ఎదురైతే ఎలా స్పందించే వాడినో తెలియదన్నాడు. ఒక అథ్లెట్‌గా ఆమె పతకానికి అర్హురాలు. ఎందుకంటే ఫైనల్ చేరింది కాబట్టి కనీసం రజతమైనా ఇవ్వాలి. మా బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు ముందు రోజు నేను వినేశ్‌ను కలిశాను. భాయ్.. గుడ్‌లక్ బాగా ఆడండి అని చెప్పింది. ఆమె చిరునవ్వులోనూ బాధను దాచేస్తోందని నాకు అనిపించింది. అందుకే ఆమె రియల్ ఫైటర్. ఒలింపిక్స్‌లో కొన్ని నియమాలు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాటికి మనం కూడా సిద్ధంగా ఉండాలి’ అనిచెప్పాడు.