
- స్టార్ రెజ్లర్ అప్పీల్‌పై కాస్ తీర్పు నేడే
పారిస్ : ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయం దక్కుతుందా? పారిస్ ఒలింపిక్స్‌లో ఆమెకు రజత పతకం ఇస్తారా? అనే సస్పెన్స్‌కు మంగళవారం తెరపడనుంది. వంద గ్రాముల అధిక బరువు కారణంగా తనపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్ చేసిన అప్పీల్ విచారణ పూర్తి చేసిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కాస్ శనివారమే తీర్పు ఇవ్వాల్సింది. కానీ, విచారణను పూర్తి స్థాయిలో మరోసారి పరిశీలించేందుకు మరింత సమయం తీసుకుంది.
విమెన్స్ 50 కేజీ కేటగిరీలో ఫైనల్ చేరిన వినేశ్ స్వర్ణ పతక పోరుకు ముందు నిర్వహించిన పరీక్షల్లో నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉండటంతో అనర్హత వేటుకు గురైంది. అయితే, పోటీల తొలి రోజు ఆమె బరువు నిర్ణీత పరిమితిలోపే ఉంది కాబట్టి ఇది మోసం కాదని, ఫైనల్ చేరినందుకు రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయవాదులు కాస్‌కు నివేదించారు.
వెయిట్ మేనేజ్‌మెంట్ బాధ్యత అథ్లెట్లదే : పీటీ ఉష
వినేశ్ బరువు పెరిగి పతకం కోల్పోయిన విషయంలో తమ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలాపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఖండించారు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి ఆటల్లో వెయిట్ మేనేజ్‌మెంట్ బాధ్యత అథ్లెట్లు, వారి కోచ్‌లదేనని స్పష్టం చేశారు. దీనికి ఐఓఏ నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్, అతని బృందానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వినేశ్ అంశం తీవ్రంగా బాధించిందన్న ఉష.. దీనికి తమ మెడికల్ టీమ్‌పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.