
తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఆశ్రయించిన విషయం తెలిసిందే. తననూ రజత పతక విజేతగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరింది. ఈ అప్పీల్‌పై మంగళవారం(ఆగష్టు 13) తీర్పు వెలువడాల్సి ఉండగా.. దీనిని కోర్టు ఆగష్టు 16కు వాయిదా వేసింది. అంతకుముందు ఈ కేసులో శనివారం తీర్పు వెలువడాల్సి ఉండగా, అది ఆగస్టు 13కి వాయిదా పడింది.
ఎటూ తేల్చలేకపోతున్న CAS
ఈ అప్పీల్ విచారణను CAS అడ్-హక్ విభాగం యొక్క ఏకైక ఆర్బిట్రేటర్, డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్(ఆస్ట్రేలియా) చూస్తోంది. ఈ కేసులో ఆమెదే అంతిమ నిర్ణయం. ఆమె తెలిపే నిర్ణయాన్ని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ వెల్లడించనుంది. కాగా, CAS ప్రకటించే ఏ నిర్ణయమైనా తాము స్వాగతిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఒకవేళ రజత పతకానికి భారత రెజ్లర్ అర్హురాలని CAS తీర్పిస్తే.. IOC వినేశ్ ఫోగాట్‌కి సిల్వర్ మెడల్ ప్రధానం చేయనుంది. దాంతో, ఎలాంటి తీర్పు వస్తుందా..! అని భారత అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
వరల్డ్ నెం.1 ఓడించి..
వినేశ్ ఫోగాట్ పతకం కోసం ఇంతలా పోరాడటానికి కారణం ఆమె సాధించిన విజయాలు. భారత రెజ్లర్ మొదటి రోజు మూడు బౌట్లలో పోరాడి విజయం సాధించింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెం.1 రెజ్లర్ యుయ్ సుసాకి(జపాన్)ని ఓడిచింది. అనంతరం రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌ను మట్టికరిపించింది. ఆపై సెమీఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ పై విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. మరుసటి రోజు ఉదయం జరిగిన బరువు కొలతల్లో ఉండాల్సిన దానికన్నా 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేశారు.