అయినా చాంపియనే..

అయినా చాంపియనే..

అంతా సవ్యంగా జరిగి  వినేశ్ ఫొగాట్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ బౌట్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకంతో  దేశ తొలి మహిళగా చరిత్ర సృష్టించేది. ఫైనల్లో  ఓడినా రజతం గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కేది. ఆమె విజయాన్ని దేశం అంతా సంబురంగా చేసుకునేది. కానీ, మనం ఒకటి అనుకుంటే విధిరాత మరోలా ఉంది. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌కు అచ్చొచ్చినట్టు లేవు.

మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు రాగానే ఆమెను వివాదాలు, గాయాలు వెంటాడుతున్నాయి. రియో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో  క్వార్టర్ ఫైనల్లో తీవ్ర గాయంతో కన్నీటితో నిష్ర్కమించిన ఆమె టోక్యోలోనూ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ దాటలేదు. పారిస్‌‌‌‌‌‌‌‌లో పతక  కల నెరవేర్చుకుంటుందని అనుకుంటే ఈసారి దురదృష్టం బరువు రూపంలో వచ్చింది.  నిజానికి ఫొగాట్ ఈ వెయిట్ కేటగిరీలోకి మారడమే సాహసోపేత నిర్ణయం అనొచ్చు.  వినేశ్ శరీర సహజ బరువు 56–57 కేజీలు ఉంటుంది. 22 ఏండ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో 48 కేజీల విభాగంలో పోటీ పడింది.

వయసు పెరిగే కొద్దీ ఆ బరువును కాపాడుకోవడం కష్టంగా మారడంతో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో 53 కేజీల కేటగిరీని ఎంచుకుంది. అప్పుడు కూడా వెయిట్ మెయింటెనెన్స్ విషయంలో చాలా కష్టపడింది. ఈ క్రమంలో తరచూ గాయాలకు గురైంది. అదే సమయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ పెద్దలకు వ్యతిరేకంగా ఆందోళన చేసి ఏడాదిన్నర పాటు సరైన ప్రాక్టీస్, పోటీలు  లేకపోవడంతో సహజంగానే ఆమె మరింత బరువు పెరిగింది. ఇంకోవైపు యంగ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ 53 కేజీల కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో కాంస్యం గెలిచి పారిస్ ఒలింపిక్స్ కోటా దక్కించుకుంది. దాంతో 50 కేజీల విభాగంలోకి దిగడం తప్ప వినేశ్‌‌‌‌‌‌‌‌కు వేరే మార్గం లేకుండా పోయింది.

పురుషులతో పోలిస్తే మహిళలు బరువును కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంచుకోవడం చాలా కష్టం. పైగా, 30 ఏండ్లకు సమీపిస్తున్నప్పుడు అంత తక్కువ బరువులో ఉండటం అంటే కత్తిమీద సామే. అయినా తక్కువ  సమయంలోనే బరువు తగ్గిన వినేశ్‌‌‌‌‌‌‌‌ పారిస్ బెర్తు కూడా దక్కించుకుంది.  కచ్చితంగా పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. చెప్పినట్టుగానే అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ఫైనల్ చేరుకుంది. కానీ, బౌట్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థులను అద్భుతంగా నిలువరించిన వినేశ్‌‌‌‌‌‌‌‌.. తన బరువును నియంత్రించుకోలేకపోవడం దురదృష్టకరం. స్వయంకృతం. తనకిదే చివరి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ అని పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ముందు వినేశ్ చెప్పింది. వచ్చే ఒలింపిక్స్ నాటికి తను 34 ఏండ్లకు చేరుకుంటుంది. ఆ మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పోటీకి తన శరీరం సహకరిస్తుందో లేదో తెలియదు.

ఏదేమైనా మూడు కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌, ఎనిమిది ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పతకాలు, రెండు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచిన వినేశ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోటుగా ఉన్నది ఒలింపిక్ పతకం మాత్రమే. అయినా  తను  ఇండియాలో అత్యంత విజయవంతమైన మహిళా రెజ్లర్ అనడంలో సందేహం లేదు. మ్యాట్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యర్థులతో..  బయట తన తోటి మహిళా రెజ్లర్ల కోసం వ్యవస్థతోనూ పోరాడిన ధీశాలి తను. ఒలింపిక్ మెడల్‌‌‌‌‌‌‌‌ లేకపోయినంత మాత్రాన ఆమె స్థాయి తగ్గబోదు. ప్రేమ నగరం పారిస్‌‌‌‌‌‌‌‌లో పతకం గెలవలేకపోయినా వినేశ్‌‌‌‌‌‌‌‌  ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలిచిన నిజమైన చాంపియన్.

ఆటలో భాగమే..

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఖాయం అయిన పతకం చేజారినా వినేశ్ ఫొగాట్ గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. పతకం కోల్పోవడం బాధాకరమే అయినా ఇదంతా ఆటలో భాగమేనని తనను ఓదార్చడానికి వచ్చిన నేషనల్ కోచ్‌‌‌‌‌‌‌‌లకు చెప్పింది. ఐఓఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ పీటీ ఉష తన వద్దకు వచ్చినప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు.

- (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌)