Vinod Kambli: ఆ రోజు నా పేరు చెప్పలేదు: సచిన్‌పై వినోద్ కాంబ్లీ విమర్శలు

టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. బ్యాటర్ గా ఇతను 90 వ దశకంలో ఒక వెలుగు వెలిగాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చిన్ననాటి స్నేహితుడిగా సుపరిచితుడు. టీమిండియా క్రికెట్ అరంగేట్రంలో సచిన్ కంటే బెస్ట్ బ్యాటర్ గా కితాబులందుకున్నాడు. అయితే అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. తక్కువ కాలం భారత క్రికెట్ జట్టు తరపున  ఆడిన కాంబ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా ఆయన సచిన్ టెండూల్కర్ గురించి విమర్శలు గుప్పించాడు. 

కాంబ్లీ మాట్లాడుతూ.. "2013 లో సచిన్ వెస్టిండీస్ పై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్  తర్వాత జరిగిన ఫేర్ వెల్ లో సచిన్ నా పేరు చెప్పకపోవడం బాధగా అనిపించింది. మేము ఇద్దరం కలిసి ప్రపంచ రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాం. మా ఇద్దరి కెరీర్ కు ఇది టర్నింగ్ పాయింట్. ఒకరకంగా సచిన్ కెరీర్ లో నేను కీలక పాత్ర పోషించాను". అని వినోద్ కాంబ్లీ తన బాధను వివరించాడు.            

కాంబ్లీ 2013లో ముంబైలో డ్రైవ్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యాడు. సంవత్సరం క్రితం యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.  1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్ లో కాంబ్లీ తొలిసారిగా భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 104 వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు.. 14 హాఫ్ సెంచరీలు చేశాడు. 17 టెస్ట్ మ్యాచ్‌ల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.