బీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ రెండు పార్టీలు.. మా నేతలను తీసుకెళ్లి ఎంపీ టికెట్ ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. మార్పు అంటే నీరు, కరెంటు లేక ఇబ్బందులు పడేలా చేయడం కాదని ఆయన దుయ్యబట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఆయన స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. ఎన్నికల సమయంలో అరెస్టులు మంచిది కాదన్నారాయన. కేసులు పెట్టి రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేజ్రీవాల్ ను విచారణ కోసమే అరెస్టు చేశారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.
ఈసారి.. బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.