ప్రజలను చైతన్య పరచేందుకే బీఆర్ఎస్ పార్టీ : వినోద్ కుమార్

దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. కొన్ని గ్రామాలు ఇప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. కమ్యూనిటీస్ స్టోరేజ్ కింద కల్లాలను నిర్మించామన్నారు. 40,199 మందికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం దోచేసిందని వినోద్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ధర్నా చేపట్టామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 150 కోట్లను రికవరీ చేశారని కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రజలకు వివరిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలని చైతన్య పరచడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టామన్నారు. కేసీఆర్ ముందు చూపుతో కల్లాలు నిర్మిస్తే కుట్రతో చెడగొట్టారని ఆయన ఆరోపించారు. రోడ్ల పై వడ్లు ఆరబెట్టితే అరెస్టులు, ఫైన్‭లు వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. ఈ విషయంలో సుప్రీంకి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక కేంద్రం గొంతు పిసికి చంపాలని చూస్తోందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.