తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు వినోద్ కుమార్. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే ఏకైక పార్టీ తమదేనన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ నవోదయ విద్యాలయాలు కావాలని పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తాను ఎంపీగా ఉంటే నవోదయ విద్యాలయాలు తీసుకువచ్చేవాడినని, కరీంనగర్ అభివృద్ధి కోసం రూ. 1000కోట్లు తెచ్చేవాడనని తెలిపారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ఏడేళ్లవుతుందని... ఇప్పటివరకు కేంద్రం కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని నిలదీశారు.
తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు వినోద్ కుమార్. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ గెలవాలన్నారు. తెలంగాణ కొసం అరాటపడే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదని విమర్శించారు వినోద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపొయిందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా పోటి చేయడానికి పార్లమెంటు సభ్యత్వమేమైనా పునారావాస కేంద్రమా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న సంకల్పం ఉన్నవారినే ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు వినోద్ కుమార్.