పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్ క్యాడర్ ను కడుపులో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలు.. వారంటీలేని గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరికి అండగా ఉంటామన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్.. నెల రోజులు పూర్తికావొస్తున్నా.. ఇంకా అమలు చేయడం లేదని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని ఆరోపించారు. కేసీఆర్ వందేళ్ల ముందు చూపుతోనే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి, విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వినోద్ కుమార్ మండిపడ్డారు.