లోక్‌‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : వినోద్ కుమార్

చొప్పదండి, వెలుగు: రాబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. బీఆర్ఎస్​ చొప్పదండి మండలస్థాయి కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గుమ్లాపూర్​లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ.. అధైర్యపడొద్దని.. అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. 

ఐదేళ్లుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో నయాపైసా పని చేయలేదని, ఆయనను ఎంపీగా గెలిపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయారని, కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి చెందిన తెలంగాణను ఆగం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్​రెడ్డి, ఎంపీపీ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చుక్కారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, లీడర్లు సాంబయ్య, వినయ్, చంద్రశేఖర్​గౌడ్ పాల్గొన్నారు.