గెలిపిస్తే.. ఖమ్మంను అభివృద్ధిలో ముందుంచుతా

  • పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు 

ఖమ్మం టౌన్, వెలుగు  :  తనను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మంను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఖమ్మం నగరంలో ఆయన ప్రచారం నిర్వహించారు. పలు డివిజన్లలోని నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు.అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

తాను గెలిచిన వెంటనే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయంను అభివృద్ధి చేస్తానని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి రోటరీ నగర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో తాండ్ర పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాజేశ్​గుప్త, వెంకట నారాయణ, మంద సరస్వతి, ఢీకొండ శ్యాం సుందర్, చంద్రశేఖర్ ఉన్నారు. 

తాండ్ర గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త  కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ లాల్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ద్వారకా నగర్ లో ఉన్న బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఆనంతు ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మదన్ లాల్ మాట్లాడారు.

మూడవసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరభద్రం, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ఎన్. శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, లాక్ష్మారెడ్డి, రామారావు, పరశురాం, రాహుల్ నాయక్, రవి, మొయినుద్దీన్, హరికృష్ణ  పాల్గొన్నారు.