ఇప్పుడు టూవీలర్ అంటే బుల్లెట్, స్పోర్ట్స్ బైక్స్, స్కూటీలు. కానీ, వీటికంటే ముందు స్కూటర్, మోటార్ సైకిల్ వంటి పేర్లతో టూవీలర్స్ ఉండేవి. అవి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అయితే, వాటిని రోడ్డు మీద చూడలేకపోవచ్చు. కానీ, మహారాష్ట్ర వెళ్తే మ్యూజియంలో చూడొచ్చు. టూవీలర్స్‌కి కూడా మ్యూజియం ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా!
ఆ విశేషాలు ఇవి...మహారాష్ట్రలోని పంచగామి, మహాబలేశ్వర్ వెళ్లే రూట్లో మెట్గుటడ్ అనే గ్రామం ఉంది. ఇది మహాబలేశ్వర్‌కి సమీపంలో ఉంటుంది. ఈ ఊరిలోనే వింటేజ్ టూవీలర్ మ్యూజియం ఉంది. దీన్ని పుణెకి చెందిన వినీత్ కెంజలె మొదలుపెట్టాడు. ఈ మ్యూజియంలో 500లకు పైగా పాతకాలం నాటి టూవీలర్స్ ఉన్నాయి. వాటిలో రకరకాల బ్రాండ్లు, వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. విజయ్ సూపర్, జావా, చేతక్, వెస్పా వంటి బ్రాండ్స్ ఉన్నాయి. మోడల్స్ విషయానికొస్తే జావా బ్రాండ్ మొదటి మోపెడ్ టూవీలర్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో సహా చాలా రకాలున్నాయి.
అంతేకాదు.. బ్రిటిష్ సోల్జర్స్ వాడిన కైనటిక్ లూనా, లాంబ్రెట్టా 59, రమోన1960, బిఎస్ఎ బాండ్ వంటి మొదటి మోనో షాక్ సస్పెన్షన్ బైక్, హెర్క్యులస్ మోపెడ్1967 వంటివి ఉన్నాయి. ఈ మ్యూజియం కోసం 1986లోనే ఆయా బ్రాండ్ల బైక్‌లు సేకరించాడట వినీత్. నాలుగు దశాబ్దాల తర్వాత 2021లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు. ఎంట్రీ ఫీజు ఒక్కరికి వంద రూపాయలు.
‘‘ఎనభైల కాలంలో ఇండియాలో బైక్స్ తిరగడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ప్రజలు పాత మోడల్స్ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన బైక్స్ కొనడానికి ఎంతో కాలం పట్టలేదు. అది చూసి అప్పటివరకు వాడిన పాత బైక్స్ అన్నీ ఏమయ్యాయి అని ఆలోచించా. అప్పటినుంచీ కనిపించకుండా పోయిన పాత బైక్‌లను కలెక్ట్ చేయడం మొదలుపెట్టా” అని చెప్పాడు వినీత్. ఈ మ్యూజియంకి వచ్చే విజిటర్స్ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఈ పాత బైక్‌లతో వాళ్లకున్న అనుభవాలను షేర్ చేసుకుంటున్నారట.