మహిళల పట్ల హింస తగ్గట్లే..

సమాజంలో కొందరు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ శక్తియుక్తులు, సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ సామర్థ్యాలు ఆర్థిక, విద్య, సాంస్కృతిక, రాజకీయపరమైనవి కావొచ్చు. ఇదే సందర్భంలో కొందరు అల్పశక్తియుక్తులను, సామర్థ్యాలను కలిగి ఉండవచ్చు. దీనివల్ల సమాజంలో అసమానతలు నెలకొంటాయి. ఈ అసమానతల వల్ల కొన్ని అంతస్తులు లేదా స్థరాలు ఏర్పడుతాయి. దీన్నే సామాజిక స్థరీకరణ లేదా అసమానత అంటారు.

సమాజంలోని కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో సామాజిక ప్రక్రియ లేదా అభివృద్ధి ప్రక్రియలో విలీనం కాని ప్రత్యేక పరిస్థితులనే సామాజిక మినహాయింపు లేదా సామాజిక వెలి అంటారు. భారతదేశంలో కులం, మతం, తెగ, లింగ, ప్రాంత భేదాలు, వైకల్యం, వృద్ధాప్యం తదితర సాంఘిక నిర్మితుల వల్ల సమాజం నుంచి వెలి వేయిబడి సరైన హక్కులను పొందలేకపోతున్నారు. మావన పరిణామ క్రమంలో భాగంగా సమాజంలో అధికారం, హోదా, సంపద పంపిణీలో కొన్నివర్గాల పట్ల వివక్ష జరిగింది. ఫలితంగా ఈ వర్గాలు తీవ్ర వెనుకబాటుతనానికి గురయ్యాయి. భారతదేశంలో సామాజిక అసమానతకు ప్రధాన కారణం కులం. అమర్త్యసేన్​ భావన: అమర్త్యసేన్​ అభిప్రాయం ప్రకారం సామాజిక మినహాయింపు రెండు రకాలు పూర్తి సామాజిక మినహాయింపు: సమాజంలో పేదరికం, వలస తదితర విభిన్న కారణాలను చూపుతూ పూర్తిగా హక్కులు, రక్షణలు పొందలేని పరిస్థితిని పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు అంటారు. పాక్షిక సామాజిక మినహాయింపు: వెలివేయబడిన వర్గాలకు హక్కులు, రక్షణలు, భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని పాక్షిక సామాజిక మినహాయింపు అంటారు.

మినహాయింపు రకాలు 
రాజకీయ మినహాయింపు: రాజకీయ ప్రక్రియలు లేదా హక్కుల నుంచి వ్యక్తులను లేద వర్గాలను నెట్టివేయడం. ఆర్థిక మినహాయింపు: ఆర్థిక ప్రక్రియల నుంచి నెట్టివేయడం, ఆర్థిక వనరులపై నియంత్రణ లేదా నిషేధం సామాజిక మినహాయింపు: సాంఘిక ప్రక్రియ, సామాజిక స్థాయిలో తగిన హోదా, భాగస్వామ్యం ఇవ్వకపోవడం. సాంస్కృతిక మినహాయింపు: ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక సంబంధ విషయాల్లో నియంత్రణ లేదా నిషేధం.

మినహాయింపుతో నష్టాలు 
సామాజిక మినహాయింపు వల్ల విలువైన మానవ వనరులను స్వల్పంగా గాని పూర్తిస్థాయిలో గాని వినియోగించుకోలేకపోతున్నాయి. మినహాయింపునకు గురైన వ్యక్తులు అసంతృప్తికి గురవుతాయి. 
దీని ఫలితంగా ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు వచ్చి సామాజిక అనిశ్చితికి కారణమవుతుంది. సామాజిక మినహాయిపు పాటించే దేశాలు ప్రపంచ ర్యాంకింగ్​లో వెనకబడి, పెట్టుబడులు మందగిస్తాయి. ఫలితంగా ప్రపంచీకరణలో వెనుకబాటుతనం ఏర్పడుతుంది. 
సామాజిక సమస్యలు కులతత్వం
ప్రఖ్యాత చరిత్రకారుడు కె.ఎం.ఫనిక్కర్​ అభిప్రాయంలో ఒక కులం వారు ఆ కులం వారికి మాత్రమే సహాయపడటం కులతత్వంలోని ప్రధానాంశం. వ్యక్తులు తమ కులం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, నిబంధనారహితమైన నమ్మకాన్ని వ్యక్తపరచడమే కులతత్వమని పనిక్కర్ నిర్వచించారు. కులతత్వంలో ఒక కులం తన కులానికి సంబంధించిన అభిరుచులకు ఉన్నత స్థానాన్ని ఆపాదించడమే గాక, ఇతర కులాల వారిని అణచివేయడానికి వెనకాడదు. భారతీయ సమాజంలో కులవ్యవస్థ వేళ్లూనుకున్నది. ప్రతి సామాజిక సంస్థ కులంతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలో ప్రతి వ్యక్తి ఇతర కులాల కంటే తన కులమే గొప్పదని భావిస్తాడు. ప్రతికులం న్యాయ వివక్షత లేకుండా తమ కుల అంతస్తును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. 
మతతత్వం
సమాజం రెండు పరస్పర విరుద్ధమైన మత సమూహాల కలయిక అని వివరించే ఒక తాత్త్విక సిద్ధాంతం. ఒక మత సమూహం మరో మత సమూహం పట్ల ప్రకటించే ప్రతికూల ధోరణిని మతతత్వము అని నిర్వచించవచ్చు. ఈ ప్రతికూల ధోరణి ఇతర వ్యక్తులకు హాని కలుగజేయడం, ఆస్తిని ధ్వంసం చేయడం, ఇళ్లు తగులబెట్టడం, స్త్రీలను అవమానపరచడం, చంపడం వంటి పలు ధోరణులతో వ్యక్తమవుతుంది. మతపరమైన హింసలో వ్యక్తులు మరొక సమూహం పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ మతపరమైన హింసలో పాల్గొంటున్న వ్యక్తులు ఉద్వేగపూరితంగా ఉంటారు. మతకల్లోలాలలో ప్రతికూలత, పకర్షణలు అత్యధికంగా ఉంటాయి. వీటికి నాయకత్వం ఉండదు. అందువల్లనే ఒక మత కల్లోలం ఏర్పడిన తర్వాత ఆయా సమూహాల మధ్య శత్రుత్వం, అపప్రథలు, ఒకరినొకరు అనుమానించుకోవడం ఎక్కువవుతాయి. 
ప్రాంతీయతత్వం
సామాజిక వ్యక్తీకరణ వల్ల సామాజిక ప్రయోజనాల మేరకు ఒక ప్రాంతం ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకోవడం, ఒక ప్రత్యేక ప్రాంతంగా గాని లేదా రాష్ట్రంగా గాని విడిపోవాలనే సామాజిక ఆకాంక్షను ఆ ప్రాంత ప్రజలు వ్యక్తం చేసినట్లయితే, అలాంటి సామాజిక ఆకాంక్షనే ప్రాంతీయవాదం అంటారు. భూభాగం, మతం, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అభివృద్ధి ధోరణులు మొదలైన కారణాలు ప్రాంతీయవాదాన్ని ప్రేరేపిస్తాయి. అయితే ప్రాంతీయవాదాన్ని అభివృద్ధి ప్రేరక ప్రగతిశీల ఆకాంక్షగా కూడా చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాంతీయవాదాన్ని జాతీయ సమగ్రతకు, ఐక్యతకు అవరోధంగా భావించవచ్చు. దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో అభివృద్ధి లోపించినప్పుడు లేదా కొన్ని ప్రాంతాలు సుదీర్ఘకాలంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి జరగనప్పుడు లేదా ఒక మత, జాతి, తెగ, భాషా సమూహానికి సరైన ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం లభించనప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

మహిళల పట్ల జరిగే హింస 
దేశంలో మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలను ప్రవేశపెట్టినా మహిళలు విద్యావంతులైనప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందినప్పటికినీ వారి పట్ల జరిగే హింస, అకృత్యాలు మాత్రం తగ్గడం లేదు. పోలీస్​ రీసెర్చ్​ బ్యూరో, ఢిల్లీ మహిళల పట్ల జరిగే నేరాలను రెండు రకాలుగా వర్గీకరించింది. 1. భారత శిక్షాస్మృ తి కిందికి వచ్చే నేరాలు 2. స్థానిక, ప్రత్యేక చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలు. పోలీస్ రీసెర్చ్​ బ్యూరో మొదటి వర్గానికి చెందిన నేరాలు ఏడుగాను, రెండో వర్గానికి చెందిన నేరాలు నాలుగుగాను గుర్తించింది. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే నేరాలు రేప్​, కిడ్నాపింగ్​, బలవంతంగా ఎత్తుకొనిపోవడం, వరకట్నపు హత్యలు, శారీరక, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, ఈవ్​టీజింగ్​. మహిళల చట్టాలు/ శాసనాల పరిధిలోకి వచ్చే నేరాలు సతీసహగమనం, వరకట్న నిషేధం, అనైతిక అక్రమ రవాణా, మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం.

చేరికకు చర్యలు 
కులం, మతం, తెగ, లింగ, ప్రాంత భేదాలు, వైకల్యం, వృద్ధాప్యం తదితర వర్గాల కోసం రాజ్యాంగంలో రక్షణలు ఉన్నాయి. ఉదా: ఆర్టికల్​15(1) ఏ రాజ్యమైనా పౌరునికి వ్యతిరేకంగా మతం, జాతి, కులం, లింగం స్థానికత కారణంగా వివక్ష చూపరాదు. ఆర్టికల్​16(1) మతం, జాతి, కులం, లింగం, నివాసం ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో ఏ పౌరునికి విచక్షణ చూపరాదు. ఆర్టికల్​ 17 ప్రకారం అస్పృశ్యతను రద్దు చేయడమైంది. ఆర్టికల్​ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిషేధం. ఆర్టికల్​ 46 బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా, ఆర్థిక పరంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ రక్షణలతోపాటు ఆయా వర్గాల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విధానాలను రూపొందించడంతోపాటు ఎప్పటికప్పుడు చట్టాలను తీసుకువస్తున్నాయి. 

సరళీకృత ఆర్థిక విధానాలు

దేశ తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ 1948  ఏప్రిల్​ 6న మొదటి పారిశ్రామిక విధానం రూపొందించారు. 
భారత ప్రభుత్వం 1948 తర్వాత మరోసారి 1956 ఏప్రిల్​న విధాన తీర్మానం ప్రవేశ పెట్టింది. 
ప్రణాళికా సంఘం 1950లో ఏర్పడింది.
మొదటి పంచవర్ష ప్రణాళికా వ్యవసాయానికి పెద్దపీట వేసింది.
రెండో పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలకు పెద్దపీట వేసింది.
1956 విధాన తీర్మానానికి ఆర్థిక రాజ్యాంగం అని పేరుంది.
1956 పారిశ్రామిక విధానానికి ప్రభుత్వం 1970, 73, 75 సంవత్సరాల్లో సవరణలు చేసింది.
1970లో ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టి పరిశ్రమలను 4 భాగాలుగా వర్గీకరించింది. 
పరిశ్రమలను కోర్​ రంగం, అధిక పెట్టుబడి రంగం, మధ్య పెట్టుబడి రంగం, రిజర్వ్​ చేయబడిన చిన్న పరిశ్రమల రంగం అని ప్రభుత్వం 1970లో వర్గీకరించింది.
1973 విధానానికి చేసిన సవరణల్లో కోర్​ రంగం 19 పరిశ్రమలు చేర్చారు. 
1975 విధానం చేసిన సవరణ ప్రకారం 21 పరిశ్రమలను లైసెన్స్​ విధానం నుంచి ప్రభుత్వం మినహాయించింది.
1977 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రభుత్వం జనవరి 23న ప్రకటించింది. 
1977 పారిశ్రామిక విధానం తీర్మానం ప్రకారం చిన్న పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. 
చిన్న పరిశ్రమల్లో కుటీర, గృహ పరిశ్రమల రంగం, సూక్ష్మ పరిశ్రమల రంగం, చిన్న పరిశ్రమల రంగం
రూ.10 లక్షల పెట్టుబడి మించని పరిశ్రమలను చిన్న పరిశ్రమలని పిలుస్తారు. 
ప్రజాస్వామ్య స్వామ్యవాదం, నెహ్రూ వియన్​ నమూనాల ఏడో పంచవర్ష ప్రణాళికా కాలంలో మూతపడ్డాయి. 
1980 జులై 3న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించింది. 
1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రూపాన్ని సంతరించుకొంది.
సోవియట్​ యూనియన్​ విచ్ఛిన్నమైన తర్వాత, ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తద్వారా ఏర్పడిన పరిణామాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆధిపత్యం పెరిగింది.
1980లో  చైనా కమ్యూనిస్టు మనస్తత్వం నుంచి బయటపడి సరళీకృత పద్ధతిలో ఓపెన్​ డోర్​ విధానం స్వీకరించింది. 
సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రభుత్వ పాత్రను కుదించడం, వివిధ దేశాల మధ్య వస్తువులు, సేవల వ్యాపారంపై ఇతర ఆంక్షలు తొలగిస్తూ ప్రభుత్వ వాణిజ్య విధానాన్ని సరళతరం చేసే ప్రక్రియను సరళీకరణ అని పిలుస్తారు. 
 పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. 
1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్​సింగ్​ ఉన్నారు.  
ఈ సంస్కరణల ఫలితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ స్థాయిలో విధానపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
భారతదేశంలో ఆరు పరిశ్రమలు మినహా, మిగతా అన్ని పరిశ్రమలు సరళీకృతం చేశారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991 జులై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. 
పారిశ్రామిక రంగానికి చట్టపరమైన, పాలనాపరమైన నియంత్రణల నుంచి విముక్తి కలిగించడ పారిశ్రామిక విధానం ప్రధాన లక్ష్యం. 
1991 పారిశ్రామిక విధానం ప్రకారం విదేశీ పెట్టుబడులను భారతదేశంలో 51శాతం వరకు అనుమతించారు. 
నూతన పారిశ్రామిక విధానం ప్రకారం ఖాయిలాపడిన పరిశ్రమలను విత్త పునర్నిర్మాణ మండలికి నివేదించాలి.
విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని ఫెరా చట్టం అంటారు. 
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఫెమా చట్టం అని పిలుస్తారు. 
ఎల్​పీజీ విధానం అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ.
నూతన ఆర్థిక విధానం 1991లో ప్రభుత్వరంగం కింద మూడు పరిశ్రమలను కుదించారు. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరళీకరణ విధానాలను అవలంబించారు. 
ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 1998లో ప్రపంచ బ్యాంక్​ నుంచి ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక పునర్​వవ్యస్థీకరణ పథకం కింద రూ.2200కోట్ల అప్పు తీసుకుంది. 
ప్రపంచ బ్యాంక్​ సూచనల మేరకు 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటివరకు అమలవుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసింది.
ప్రపంచబ్యాంక్​ సూచనల మేరకు వ్యయ ప్రాధాన్యతలను మార్చుకున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు కేటాయింపులు తగ్గించింది. 
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అసమానతలు సరళీకరణ  కాలంలో మరింత పెరిగాయి.