విశ్లేషణ: పోలీసు వ్యవస్థలో మార్పొస్తదా?

దేశంలో పోలీసు కస్టడీలో నిందితులపై హింస, వేధింపులు పెరిగిపోతున్నాయి. పోలీసు ఠాణాల్లో ఎంతోమంది చిత్రహింసలకు గురవుతున్నా.. ఎవరైనా మరణిస్తేనే అటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్​ వ్యవస్థలో మార్పొస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. వీటికి అడ్డుకట్ట పడాలంటే కానిస్టేబుల్​ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరికీ మానవ హక్కులపై శిక్షణ ఇవ్వాలి. సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్లపై అందరికీ అవగాహన కల్పించాలి. ఖాకీ డ్రెస్​ వేసుకుని నేరాలకు పాల్పడే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. పోలీస్​ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీస్​ కంప్లయింట్​ అథారిటీల ఏర్పాటును వేగవంతం చేయాలి. అప్పుడే పోలీసు నేరాలకు చెక్​ పడుతుంది.

ఏటా 3 వేలకుపైగా ఫిర్యాదులు

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే, అమాయకులపై కేసులుపెట్టి.. చట్టవిరుద్ధంగా చితకబాదుతున్న ఘటనలెన్నో. కేంద్రం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా పోలీసుల నేరాలపై మూడు వేలకుపైగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇటీవల సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ కూడా మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా పోలీసు ఠాణాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు నేరాలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు 2015లో దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లు, జైళ్ల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను శాశ్వత ప్రాతిపదికన అమర్చాలని, వీటి ఏర్పాటు, నిర్వహణపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అధికారిక పర్యవేక్షణ కమిటీలను నియమించాలని ఆదేశించింది. నేటికీ కొన్ని పోలీస్​ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

కలకలం రేపుతున్న కస్టోడియల్​ మరణాలు

గతేడాది తమిళనాడులో జయరాజ్, ఫెనిక్సుల కస్టోడియల్ మరణం, ఈ ఏడాది మన రాష్ట్రంలో మరియమ్మ కస్టోడియల్ మరణం కలకలం రేపాయి. అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్ పోలీసు హింస కారణంగా మరణిస్తే, అతన్ని చంపిన డెరెక్ చౌవిన్ అనే పోలీసు ఆఫీసర్​ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా, హత్యా నేరం కింద 22.5 ఏండ్ల జైలు శిక్ష వేశారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. కానీ, వీరికి జైలు శిక్ష పడుతుందా? అనేది దేవుడికెరుక. మరియమ్మ కేసు సీబీఐకి అప్పగించాల్సిందని హైకోర్టు నవంబర్ 12న అభిప్రాయపడింది. అదేరోజు సూర్యాపేట జిల్లాలో దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ గిరిజనుడిని చట్టవిరుద్ధంగా పోలీసులు చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాష్ట్ర జాబితాలో పోలీసులు, కోర్టులు, జైళ్లు

రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లోని ఆర్టికల్ 246 ప్రకారం, పోలీసు వ్యవస్థలు, కోర్టులు, జైళ్లు మొదలైనవి రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. స్వాతంత్ర్యానికి పూర్వం అప్పటి బ్రిటిష్ పాలకులు నేరాలకు సంబంధించిన మూడు చట్టాలైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఇండియన్​ పీనల్​ కోడ్(ఐపీసీ), ఇండియన్​ ఎవిడెన్స్​ యాక్ట్ లను అమల్లోకి తెచ్చారు. ఇప్పటికీ మనం ఈ చట్టాలనే కొన్ని సవరణలు చేసి వాడుతున్నాం. కానీ, కొందరు పోలీసులు వారికి సీఆర్పీసీ ద్వారా ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్పీసీ, 1973 ప్రకారం నేరాలను రెండు రకాలుగా విభజిస్తారు. 1) గుర్తించదగిన నేరం, 2) గుర్తించలేని నేరం. సీఆర్పీసీలోని సెక్షన్ 41 ప్రకారం పోలీసు ఆఫీసర్ గుర్తించదగ్గ నేరం అయిఉండి, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నిందితుడిని మేజిస్ట్రేట్ జారీ చేసిన అరెస్ట్​ వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. గుర్తించలేని నేరమైతే తప్పకుండా మెజిస్ట్రేట్ నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకుని నిందితుడిని అరెస్టు చేయాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 46 ప్రకారం మహిళలను సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు అరెస్టు చేయరాదు. సాధారణ సమయాల్లో కూడా వీరిని మహిళా పోలీసులే అరెస్టు చేయాలి. ఇక నేరాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. 1) సమ్మేళన నేరం. 2) అసమ్మేళన నేరం. సమ్మేళన నేరం అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి పై కేసు నమోదు చేస్తే అటువంటి కేసులో రాజీ కుదురుతుంది. అసమ్మేళన నేరం అంటే ప్రభుత్వం లేదా పోలీసులే నమోదు చేసే కేసులు. వీటిలో రాజీ కుదరదు. సీఆర్పీసీ 1973లోని సెక్షన్ 320లో నోటిఫై చేయనటువంటి.. ఐపీసీలో తెలిపిన సెక్షన్లన్నీ అసమ్మేళన నేరాలుగా పరిగణిస్తారు.

అమాయకులపై తప్పుడు కేసులు

కొన్ని సందర్భాల్లో పోలీసులు సీఆర్పీసీని పాటించకుండా నిందితుడిని చితకబాది, చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిమాండ్ కేసు డైరీలో తెలివిగా కేసును నమోదు చేస్తున్నారు. సీఆర్పీసీ 2008 (సవరణ) చట్టం ప్రకారం గుర్తించదగిన నేరమైతే నిందితుడికి అప్పియరెన్స్ నోటీసులు పంపినట్లు పత్రాలను సృష్టిస్తున్నారు. నిందితుడు ఆ నోటీసులకు స్పందించలేదని, ఉదయం వేళల్లో లేదా మధ్యాహ్నం వేళల్లో అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని కోర్టులకు తెలియజేస్తున్నారు. ఇలా తప్పుడు సమాచారం రాసి కేసును ఏకపక్షంగా నడిచేటట్లుగా చేస్తున్నారని పలు కేసుల విచారణల్లో వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు వినయ్ త్యాగి వర్సెస్ ఇర్షద్ అలీ, తానా సింగ్ వెర్సెస్ సెంట్రల్ బ్యూరో అఫ్ నార్కోటిక్స్ కేసుల్లో తీర్పు ఇస్తూ.. పోలీసులు అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సూరత్ బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించిన హుస్సేన్ ఘాడియల్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో 11 మంది అమాయకులను ఇరికించగా, వారికి న్యాయం జరగడానికి 19 ఏండ్లు పట్టింది. 2007లో హైదరాబాద్ మక్కా బాంబ్ బ్లాస్ట్ కేసులో 16 మంది అమాయక ముస్లిం యువతను ఇరికించగా, వారికి 2011లో న్యాయం జరిగింది. 

పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి

పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఇన్​స్పెక్టర్, సబ్ ఇన్​స్పెక్టర్, కానిస్టేబుళ్లు డబ్బులకు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టబద్ధంగా పనిచేసినట్లైతే ఇటువంటి నేరాలకు తావుండదు. కింది స్థాయి పోలీసుల నేరాలను కట్టడి చేయవలసిన బాధ్యత ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఉంది. క్షేత్రస్థాయిలో ఇన్​స్పెక్టర్, సబ్ ఇన్​స్పెక్టర్, కానిస్టేబుళ్ల   పనితీరు, ప్రవర్తన బాగా లేకపోతే జనానికి పోలీసులపై నమ్మకం లేకుండా పోతోంది. అలాగే ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన మానవ హక్కులు, సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలపై కనీస అవగాహన అవసరం. వీటిని ప్రాథమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో భోదించాలి. అలాగే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్​ అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కానిస్టేబుల్​ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ మానవ హక్కులపై ఏటా శిక్షణా తరగతులు నిర్వహించాలి. రాష్ట్రంలో ఖాకీ డ్రెస్సుల్లో పని చేస్తున్న నేరగాళ్లను గుర్తించి, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అలాగే వెంటనే పోలీసు కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. అన్ని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. అప్పుడే పోలీసు నేరాలు 
తగ్గుముఖం పడతాయి.

తప్పు చేస్తే పోలీసులూ శిక్షార్హులే

పోలీసులు తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను తయారు చేసినట్లయితే ఐపీసీ సెక్షన్ 167 ప్రకారం, తప్పుడు ఎఫ్ఐఆర్ ను తయారుచేస్తే ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం వారు కూడా శిక్షార్హులే. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నాక నేరాన్ని చేసినట్లు ఒప్పుకోవాలని హింసించినా, నిందితుడిని బలవంతంగా ఒప్పించినా, ఇండియన్​ ఎవిడెన్స్​ యాక్ట్, 1872లోని సెక్షన్ 25, 26 ప్రకారం అలాంటి నేరాంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాలపాలు చేసి రిమాండుకు పంపేటప్పుడు జడ్జి దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదని చెప్పించే పోలీసు వ్యవస్థలో మనం బతుకుతున్నాం. కేసులో అమాయకులనే నిందితులుగా రుజువు చేయడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. అలాంటి కేసుల్లో సంబంధిత పోలీసులు ఐపీసీ సెక్షన్ 192, ఇండియన్​ పోలీస్​ యాక్ట్​ 1861లోని 29 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు. చాలామంది పోలీసులు ప్రజలను కొట్టడం చట్టాలకు విరుద్ధంగా వారిని హింసించడం డ్యూటీలో భాగంగా భావిస్తున్నారు. ఇంకొందరు సివిల్ కేసులు, భూతగాదాలు, చట్టవిరుద్ధ సెటిల్మెంట్లలో తలదూరుస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్​ సింగ్ వర్సెస్ యూనియన్ అఫ్  ఇండియా కేసులో తీర్పు ఇస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోలీసు కంప్లయింట్​ అథారిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం 2021 జూన్ లో, పోలీస్​ కంప్లయింట్​ అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.

- కోడెపాక కుమారస్వామి, సోషల్​ యాక్టివిస్ట్