మణిపూర్​లో మళ్లీ అల్లర్లు..సీఎం బీరేన్, మంత్రుల ఇండ్లపై దాడి

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు..సీఎం బీరేన్, మంత్రుల ఇండ్లపై దాడి
  • ఎమ్మెల్యేల నివాసాల్లో  ఫర్నిచర్ ధ్వంసం
  • కుకీ మిలిటెంట్లపై చర్యలు చేపట్టాలని మైతీల డిమాండ్
  • సంక్షోభాన్ని రూపుమాపే చర్యలు తీసుకోవాలని డిమాండ్​
  • ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఏడు జిల్లాల్లో ఇంటర్ నెట్ నిలిపివేత

ఇంఫాల్/గౌహతి:మణిపూర్​లో హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి సీఎం బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. అర్ధరాత్రి దాటాక జిరిబామ్ పట్టణంలోని పలు నివాసాలు, రెండు ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌‌ ప్రయోగించాయి. కాగా, ఇటీవల మైతీ వర్గానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురిని కుకీ వర్గీయులు కిడ్నాప్ చేసి హత్య చేయడంతో మణిపూర్​లో అల్లర్లు చెలరేగాయి. 

మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉన్నది. ఆదివారం తెల్లవారుజామున ఇంఫాల్ వెస్ట్‌‌ సగోల్ బంద్‌‌లో ఉంటున్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇండ్లపై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఫర్నీచర్​ను రోడ్డుపైకి తీసుకొచ్చి తగులబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, విష్ణుపూర్, తౌబల్, కాక్చింగ్ జిల్లాలతో పాటు ఇంఫాల్ వ్యాలీలో కర్ఫ్యూ విధించారు. మొత్తం ఏడు జిల్లాల్లో ఇంటర్​నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండ్లను తగులబెట్టిన 23 మందిని మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తుపాకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్మ్​డ్ ఫోర్సెస్ యాక్ట్ ను రద్దు చేయాలి

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. మణిపూర్ ప్రజలను సంతృప్తి పర్చేలా ఉండాలని మైతీ వర్గానికి చెందిన సివిల్ రైట్స్ గ్రూప్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అల్లర్లు మరింత చెలరేగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కుకీ మిలిటెంట్లను అణిచివేసేలా సైనిక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. తమ వర్గానికి చెందిన ఆరుగురిని హత్య చేసినోళ్లను 24 గంట్లలో అరెస్ట్‌‌ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

 ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్​డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్ (ఏఎఫ్ఎస్​పీఏ)పై మణిపూర్ వాసులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని కోరారు. లేకపోతే మణిపూర్ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటదని హెచ్చరించారు. కాగా, ఆరు పోలీస్ స్టేషన్లలో విధించిన ఆర్మ్​డ్ ఫోర్సెస్ యాక్ట్​ను ఉప సంహరించుకోవాలని కేంద్రాన్ని మణిపూర్ ప్రభుత్వం కోరింది.

బాధితులను మోదీ పరామర్శించాలి: కాంగ్రెస్

మణిపూర్​లో చెలరేగిన హింసపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ వెళ్లి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. మణిపూర్​ను బీజేపీ కావాలనే తగులబెట్టేస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపిం చారు. మణిపూర్​కు మోదీ ఎప్పుడెళ్లినా అక్కడి ప్రజలు ఆయన్ను క్షమించరని అన్నారు. 

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాగా, ఈ నెల 11న సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోయిన యువకుల పోస్టుమార్టం రిపోర్టు లు అందేవరకు వారికి అంత్యక్రియలు చేయబోమని కుకీ జో నేతలు చెప్పారు.