ప్రజాస్వామ్యంలో హింస ఏ రూపంలో ఉన్నా అది నేరమే. కానీ, నిరసన తెలపడం మాత్రం తప్పు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిరసన, అసమ్మతి తెలియజేయడమన్నది ప్రభుత్వాన్ని నడపడంలో అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కొన్ని సరైన ఆంక్షలతో భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. శాంతియుత నిరసన అన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే దాన్ని ఉపయోగించేటప్పుడు కొంత సంయమనం పాటించాలి.
కొన్ని రైతు సంఘాలు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టాయి. మొన్నటి వరకు అది ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగింది. ఈ విషయంలో మోడీ సర్కారు ఆదర్శప్రాయంగా వ్యవహరించింది. ఆ నిరసనను అడ్డంకిగా భావించలేదు. దేశ రాజధానికి దారితీసే కీలక మార్గాలను మూసేసేందుకు నిరసనకారులు ప్రయత్నించినా కేంద్రం సంయమనాన్ని పాటించింది. ఎంతో కాలంగా ఈ మూసివేతల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిని అనేక వ్యాపారాలకు భారీ నష్టం జరుగుతుండటమే కాదు, సాధారణ ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది.
పట్టువిడుపులు ఉండాలి
చర్చల్లో సరైన ఫలితాన్ని పొందేందుకు రెండు వైపుల నుంచి పట్టువిడుపులు ఉండాలి. ప్రభావవంతమైన చర్చల ప్రక్రియ రెండు పక్షాలకు మేలు చేస్తుంది. కనీసం రెండు పక్షాలు అలా భావించే పరిస్థితిని కల్పిస్తుంది. కానీ, రైతు సంఘాలతో ఇప్పటి వరకు జరిపిన చర్చలు అసాధారణంగా ఏకపక్షంగా సాగాయి. రకరకాల ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వచ్చినా అటు వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన రావడం లేదు. ఇలాంటి చర్చలు సఫలమై, పరస్పర లాభదాయక పరిస్థితిని సృష్టించడం అరుదు. నిరసనలు తప్పుడు మార్గంలోకి వెళ్లిన తీరును విశ్లేషించడం ద్వారా రైతు సంఘాలు దిగువ పేర్కొన్న మూడు పొరపాట్లు చేసినట్టు నాకనిపిస్తోంది.
1) హింస ఎటువంటి ఫలితాన్ని అందించదు
దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన మహాత్మా గాంధీ తెలివైన నిరసనకారుడు. నిరసనలకు ఆయన ఒక విజయవంతమైన సూత్రాన్ని రూపొందించి దానికి అహింసా ఉద్యమం అని పేరు పెట్టారు. దాని ద్వారా బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఆ తర్వాత ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. హింస అనేది ఏ రూపంలో ఉన్నా, అది నిరసన ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీస్తుందని ప్రారంభంలోనే గాంధీ గుర్తించారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని తెలియజేసేందుకు ప్రధాన అస్త్రం నిరసన. శాంతి భద్రతలను భగ్నం చేయడం, హింస, విధ్వంసాలకు పాల్పడేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పుడు, హింసాత్మక నిరసనలతో సాధించే ఫలితం శూన్యం. హింస, విధ్వంసం, జాతీయ చిహ్నాలను అపవిత్రపరచడం వంటి పనుల ద్వారా శాంతియుతంగా సాగుతున్న నిరసనను పక్కనదారి పట్టించేలా చేయటం రైతు సంఘాలు చేసిన పెద్ద పొరపాటు. దేశవ్యాప్తంగా వారి నిరసనకు లభించిన ప్రజామద్దతును ఈ చర్యల ద్వారా వారు కోల్పోయారు. అది తిరిగి సాధించలేనిది.
2) బయటపడిన నాయకత్వలేమి
నాయకత్వమంటే జవాబుదారీతనం. చర్యలు, పరిణామాలకు అది బాధ్యత వహించాలి. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన విధ్వంసం, నిరసనలకు విశ్వసనీయమైన నాయకత్వం లేదనే విషయాన్ని బయటపెట్టింది. ఒప్పందాలను గౌరవించనట్లయితే నాయకత్వానికి అర్థం లేదు. జనవరి 26 దేశానికి సంబంధించి అతి పెద్ద రోజు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. రైతు సంఘాలు, వాటి నాయకులు(ఎవరైనా ఉంటే) దానిని గౌరవించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాల్సింది. అలా చేయడం వలన వారి వాదనకు నిజంగా ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటే దానికి బలం చేకూరేది. కానీ, రిపబ్లిక్ డే రోజున సృష్టించిన హింస, విధ్వంసానికి నిరసనలకు ఎటువంటి సంబంధం లేదన్నది వాస్తవం. నియంత్రించలేని ఒక ఘటన నిరసన తెలుపుతున్న వర్గంలో నిజాయితీ, ఉమ్మడి లక్ష్యం లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. అసాంఘిక, దేశవ్యతిరేక, అవకాశవాద రాజకీయ శక్తులు, వేర్పాటువాదులు రైతుల నిరసనను తమ చేతుల్లోకి తీసుకున్న విషయం స్పష్టమవుతోంది. టీవీల్లో ఆ ఘటనలను దేశమంతా చూసింది. ఊహించని విధ్వంసం, ఎటువంటి కవ్వింపు లేకుండానే పోలీసులపై భౌతిక దాడులన్నీ విశ్వసనీయమైన నాయకత్వం లేక రైతుల నిరసన తప్పుడు మార్గంలో వెళ్లోందనే విషయాన్ని సూచించాయి. నాయకత్వ లేమి ఏ నిరసనకైనా ప్రమాదకరం.
3) చర్చలు కొనసాగేనా?
భవిష్యత్ లో ఎవరితో ప్రభుత్వం చర్చలు జరిపాలి? రైతు సంఘాల నాయకులకు విశ్వసనీయత ఎక్కడుంది? నిరసన తెలుపుతున్న వర్గాలపై అణుమాత్రం నియంత్రణ లేని వారు అంగీకరించిన తీర్మానాన్ని అమలు కానిస్తారనే నమ్మకం ఎక్కడుంది? ఎవరినైనా చర్చలకు మళ్లీ ఆహ్వానించే ముందు ఈ ప్రశ్నల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని నాకనిపిస్తోంది. తమ ముఖ్య ఉద్దేశాన్ని నిరసనకారులు విస్మరించినట్టయితే అలాంటి వారితో ప్రభుత్వం చర్చలు జరిపినా దానివలన ఒనగూరేదేమి ఉండదు. ఆ రోజున నిరసనకారులు సృష్టించిన అరాచకం, హింసకు ఏ కారణం, ఉద్దేశం చూపినా అది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. అసలు రైతుల నిరసనల ఉద్దేశానికి యాంటీ సోషల్ బిహేవియర్‌కు ఏ మాత్రం సంబంధం లేదన్నది వాస్తవం. బాధ్యతఅఈను విడిచిపెట్టడం వలన కలిగే పరిణామాలు నాయకత్వానికి చాలా భారంగా మారతాయి. ఈ విషయంలో రైతు సంఘాల నాయకులకూ మినహాయింపు ఉండదు. నియంత్రణ లేకపోవడం, జవాబుదారీతనం లోపించడం నాయకత్వ శక్తిని క్షీణింపజేస్తాయి. కారణం, లక్ష్యం, ప్రయోజనం, విశ్వసనీయత కోల్పోయిన నిరసనను పక్కన పెట్టి చివరి దఫా జరిపిన చర్చల్లో కేంద్రం చూపిన పరిష్కారాన్ని అంగీకరించి నిరసనకారులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లి తమ పనుల్లో నిమగ్నం కావడం ప్రస్తుతం చాలా మంచిది.
కొత్త కొత్త డిమాండ్లు చేస్తున్న రైతు సంఘాలు
నిరసన ప్రారంభించిన నాటి నుంచి రైతు సంఘాలతో చర్చలు జరుపుతూ మోడీ ప్రభుత్వం చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది. కొత్తగా రూపొందించిన సంస్కరణాత్మక వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల ఆందోళనలు పరిష్కరించి, విభేదాలు చక్కదిద్దేందుకు పదిసార్లు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. రైతులతో జరిపిన అన్ని సమావేశాల్లో సీనియర్ మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులతో పలు దఫాలుగా సాగిన చర్చల్లో నవంబర్ నుంచి వారు లేవనెత్తుతున్న పలు డిమాండ్లను మోడీ ప్రభుత్వం అంగీకరించింది. రైతు సంఘాలు ప్రస్తావించిన డిమాండ్లను ప్రతీసారి ప్రభుత్వం అంగీకరించినా వారు మళ్లీ కొత్త డిమాండ్లు లేవనెత్తి తమ వైఖరి మార్చుకునేవారు. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతో సహనంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అంతే కాదు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ అందజేసేంత వరకు 18 నెలల పాటు కొత్త చట్టాల అమలును నిలిపివేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఈ చొరవలేవీ రైతు సంఘాలను సంతృప్తి పరచలేకపోయాయి. కొత్తగా అమల్లోకి తెచ్చిన అగ్రి చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేని వారు పట్టుబడుతున్నారు.
కృష్ణసాగర్ రావు,
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి