- ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టిన ఏకసభ్య కమిషన్ చైర్మన్
- వర్గీకరణ నిలిపివేయాలని మాల సంఘం, త్వరగా పూర్తి చేయాలని మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
ఆదిలాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి హాజరుకాగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పలు సంఘాల నాయకులు, ప్రజలు హాజరై తమ వినతులను అందజేశారు. అనంతరం కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేపడుతున్నామని, ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వినతులు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందరి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
మాల, మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయసేకరణ సందర్భంగా మాల, మాదిగ సంఘాల ఆధ్వర్యంలో పోటాపోటీగా ఆందోళనలు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయొద్దంటూ మాల సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా 1,250 అప్లికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలంటూ మాదిగ సంఘం నాయకులు కలెక్టరేట్ ద్వారం ఎదుట నిరసనకు దిగారు. ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగ కులస్తులకు న్యాయం జరుగుతుందన్నారు. వర్గీకరణ బిల్లు పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్, టీఎమ్మార్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు రమేశ్, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.