సెలవు రోజుల్లో వీఐపీ దర్శనాలు ఉండవ్

  • గుట్టలో శని, ఆదివారాలతోపాటు సెలవుల్లో నిలిపివేస్తూ దేవస్థానం నిర్ణయం

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో  వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి వారంలో ఐదు రోజులు మాత్రమే వీఐపీ దర్శనాలుంటాయి. ఇతర సెలవు రోజుల్లోనూ వీఐపీ దర్శనాలు ఉండవు. వీకెండ్​తో పాటు సెలవు రోజుల్లో స్వామివారి సేవలో పాల్గొనాలంటే వీఐపీలు సైతం సాధారణ దర్శనాల క్యూలైన్​లోనే వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతిరోజూ వీఐపీల కోటా కింద ఉదయం గంట, సాయంత్రం గంటపాటు దర్శన సమయాన్ని కేటాంచారు. ఆ టైంలో రూ. 150 పెట్టి వీఐపీ బ్రేక్​ టికెట్​తీసుకోవాల్సి ఉంటుంది. వీఐపీల బ్రేక్ దర్శనాల సమయంలో గతంలో సాధారణ క్యూలైన్​లో వచ్చే భక్తులను పంపించేవారు. టెంపుల్​ పునఃప్రారంభమైన తర్వాత బ్రేక్​టైంలో సాధారణ భక్తులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆరేండ్ల తర్వాత టెంపుల్​పునఃప్రారంభం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. స్పెషల్​ దర్శనాలకు గంట, ధర్మదర్శనానికి మూడు గంటల టైం పడుతోంది. సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుండడంతో వీఐపీ బ్రేక్​ దర్శనాలను వీకెండ్​లో నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన వీకెండ్​లో దర్శనానికి వచ్చే వీఐపీలు ధర్మదర్శనం క్యూలోనే వెళ్లాల్సి ఉంటుంది.  

భక్తులతో కిటకిట

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కొండ కింద గండిచెరువు సమీపంలోని కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించుకోవడానికి గంటలపాటు వెయిట్​ చేయాల్సి వచ్చింది. దర్శన టికెట్లు తీసుకోవడానికి సైతం గంటలకొద్దీ బారులు తీరారు. కొండపైకి చేరుకున్న భక్తులు సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎక్కడినుంచి క్యూలైన్లలోకి ఎంటర్ కావాలో తెలియక సతమతమయ్యారు. దర్శన టికెట్లు లేకున్నా ఆఫీసర్లు కొందరిని దర్శనానికి అనుమతించడంతో భక్తులు వాగ్వాదానికి దిగారు. టికెట్లు లేకున్నా ఎలా క్యూలైన్లలోకి అనుమతిస్తారని ఆఫీసర్లతో లొల్లి పెట్టుకున్నారు. సెల్ ఫోన్లు భద్రపర్చే క్లాక్ రూం వద్ద వేర్వేరు కౌంటర్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్లాక్ రూంలో భద్రపర్చిన కొందరి సెల్ ఫోన్లు మిస్ అయ్యాయి.  నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.31 లక్షల 45,540 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.16 లక్షల 50,700 ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.

మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం

వీకెండ్​లో వీఐపీ దర్శనాలకు బ్రేక్​ అంటూ దేవస్థానం నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే స్వామివారిని మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, జగదీశ్​రెడ్డి దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో వీకెండ్​లో ‘వీఐపీ దర్శనాలకు బ్రేక్’​నిర్ణయం అమలవుతుందా.. అని సామాన్య భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.