డెంగీ దడ.. ​ హాస్పిటల్స్​కు క్యూ కడుతున్న రోగులు

  • విజృంభిస్తున్న వైరల్​ ఫీవర్
  • ప్లేట్​లెట్లు తగ్గుతుండడంతో ఆందోళనలో ప్రజలు 

నాగర్​కర్నూల్, వెలుగు:  జిల్లాలో వైరల్​ జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు గవర్నమెంట్, ప్రైవేట్​ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్​ మొదలుకుని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అమ్రాబాద్​ కమ్యూనిటీ హాస్పిటల్స్​లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఏజెన్సీలోని అమ్రాబాద్‌, లింగాల, పదర, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో బెడ్స్​ ఫుల్​ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో  టెస్టులు, ట్రీట్​మెంట్​కు ఇబ్బంది లేకపోయినా డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా ప్రైవేట్  హాస్పిటల్స్​ను ప్రిఫర్​ చేస్తున్నారు. ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ​టెస్టులు, మందులు, బెడ్​ చార్జీలు అంటూ వేలకు వేలు వసూలు​ చేస్తున్నారు. ​

పెరుగుతున్న రోగులు..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్​ అస్పత్రిలో జులై నుంచి ఫీవర్​ కేసుల సంఖ్య 280 దాటింది. ఇందులో 8 డెంగీ కేసులున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే చేపడుతున్నారు. మున్సిపల్, పంచాయతీ, మెడికల్​ అండ్  హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో ​ ఫాగింగ్,​ బ్లీచింగ్​ పనులు చేపట్టడానికి ఫండ్స్​ ఉన్నా పర్యవేక్షణ లేక దోమలు పెరుగుతున్నాయి. డెంగీ. టైఫాయిడ్​ కేసులతో ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్తున్నవారు ప్లేట్​లెట్స్​ తక్కువ అవుతున్నాయనే భయంతో హైదరాబాద్​కు వెళ్తున్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జులైలో 30 కేసులు, ఆగస్టులో 115 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 

ALSO READ: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కేటీఆర్

వీటిలో మైనర్  డెంగీ లక్షణాలు ఉన్న కేసులు నమోదైనప్పటికీ ట్రీట్​మెంట్​తో తగ్గాయి. డెంగీ, వైరల్ ఫీవర్ టెస్టులు, మందులు  ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అమ్రాబాద్  15 టైఫాయిడ్, 30  వైరల్  ఫీవర్  కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో లింగాల ప్రభుత్వ ఆసుపత్రిలో 6 డెంగీ కేసులు, సెప్టెంబర్​లో  5 డెంగీ కేసులు నమోదయ్యాయి. అచ్చంపేట గవర్నమెంట్​ హాస్పిటల్​లో గత నెలలో 91 వైరల్​ ఫీవర్​ రోగులు వచ్చారు. కొల్లాపూర్​ గవర్నమెంట్​ హాస్పిటల్​లో 61 వైరల్​ ఫీవర్​ కేసులు నమోదయ్యాయి. వాతావరణంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులతో ఆగస్టులో వైరల్​ ఫీవర్​ కేసులతో పాటు సర్ది, దగ్గు, గొంతు నొప్పి కేసులు పెరిగాయి. 

అవుట్​ పేషెంట్లు ఫుల్..

జిల్లాలో వివిధ రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది మంది గవర్నమెంట్​ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు -800 నుంచి -900 అవుట్​ పేషెంట్లు ట్రీట్​మెంట్​ కోసం వస్తున్నారు. కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో 350 నుంచి- 400, అచ్చంపేటలో 200 నుంచి- 300, కొల్లాపూర్ లో 200 నుంచి-300, కల్వకుర్తి సీహెచ్​సీల్లో 300 నుంచి-400 వరకు ఓపీ నమోదవుతోంది. పీహెచ్​సీలకు ప్రతి రోజు 40 మంది వరకు, బస్తీ దవాఖానలకు 20 మంది చొప్పున అవుట్​ పేషెంట్స్ ట్రీట్​మెంట్​కు వస్తున్నారు

ఐదు రోజుల్లో రూ.23 వేలు ఖర్చు..

నా మేనల్లుడు రఘు(15) జ్వరం, దగ్గు, వాంతులతో బాధపడుతుంటే కల్వకుర్తిలో ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకపోయినం. డెంగీ లక్షణాలు ఉండడంతో ట్రీట్​మెంట్​ చేయించినం. ఐదు రోజులకు రూ.23 వేలు ఖర్చయింది. కూలీ పని చేసుకునేటోళ్లం. అక్కడ ఇక్కడ తెచ్చి చూపించాల్సి వచ్చింది. గవర్నమెంట్​ హాస్పిటల్​లో పట్టించుకుంటే మాలోంటళ్లకు మంచిగ ఉంటది.

ప్రమోద్, తర్నికల్​ తండా