వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
  • డెంగ్యూ, చికెన్​గున్యా లక్షణాలతో  జ్వరాలు 
  • రక్తపరీక్షల్లో నెగెటివ్​ రిపోర్ట్​
  •  కీళ్లు, ఒళ్లు నొప్పులతో రోగులకు అవస్థలు

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లా అంతటా వైరల్​ ఫీవర్స్​ జనాన్ని వణికిస్తున్నాయి. అసలు ఇవి ఏ తరహా జ్వరాలో అంతుబట్టక సీనియర్​ డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన వారికి చికెన్​ గున్యా  తో పాటు  డెంగ్యూ  లక్షణాలు కూడా ఉంటున్నాయి. అయితే బ్లడ్ టెస్టుల్లో నెగెటివ్​ వస్తుండడంతో  జ్వరాలొచ్చినవారు అయోమయానికి గురవుతున్నారు.

 దీంతో ఆసుపత్రుల్లో   వైరల్​ఫీవర్స్​కు  వాడే   మందులు ఇస్తున్నారు. ఈ మందులకు  జ్వరాలు తగ్గకపోవడం, తగ్గినా కీళ్లనొప్పుల వంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.   జ్వరం వచ్చిన వారిలో  కీళ్లు, ఒళ్ళు నొప్పుల లాంటి చికెన్ గున్యా లక్షణాలు,   ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, దురద, దద్దుర్లు, వాపులు లాంటివి డెంగ్యూ లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నాయి.  బీపీ డౌన్ కావడం, కళ్ళు తిప్పడం వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి.   ఈ జ్వరం సోకినవారు  కీళ్లు, ఒళ్ళు నొప్పులతో  ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో చాలామంది సొంతంగా నడవలేకపోవడంతో   కుటుంబ సభ్యులు ఎత్తుకొని తీసుకొస్తున్నారు. రోగులను పరిశీలిస్తే డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు కనిపిస్తుండగా .. రక్త పరీక్షల్లో మాత్రం  వైరల్ ఫీవర్  లక్షణాలు మాత్రమే  వెల్లడవుతున్నాయి.   జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 3వేల  మందికి  రక్త పరీక్షలు చేస్తే  కేవలం 108 మందికి మాత్రమే డెంగ్యూ నిర్థారణ అయ్యింది.  

జ్వరం తగ్గినా నొప్పులు తగ్గడంలేదు  

వైరల్ ఫీవర్స్​తో ప్రభుత్వ, ప్రైవేటు, ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న  వారు  వారం రోజులైనా పూర్తిగా  కోలుకోవడం లేదు.   కోలుకున్న తర్వాత కూడా 20 రోజుల నుంచి నెల వరకు  కీళ్లు, ఒళ్ళు నొప్పులు, నీరసం, బీపీ,  కళ్ళు తిప్పడం వంటి సమస్యలతో  బాధపడుతున్నారు. నొప్పులు తగ్గడానికి  డాక్టర్లు పెయిన్​ కిల్లర్స్​తో పాటు తక్కువ  మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సివస్తోందని అంటున్నారు.  

నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ తో   పాటు  ఖానాపూర్ పట్టణంలో  వారం రోజులుగా జ్వరాలు  విజృంభిస్తున్నాయి.  ఒక్కో  ఇంట్లో ఇద్దరు ముగ్గురు   జ్వరం,  కీళ్లు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల  మెడికల్​ క్యాంపులు పెట్టారు. మూడు రోజులుగా డాక్టర్లు చికిత్స చేస్తుంటే  ఇప్పుడిప్పుడే కొంతమంది  కోలుకుంటున్నారు.   


లక్షణాలున్నా  నెగెటివ్ రిపోర్టులు .

తీవ్రమైన జ్వరాలతో   బాధపడుతున్న వారిలో చికెన్ గున్యా,  డెంగ్యూ లక్షణాలు భౌతికంగా కనిపిస్తున్నా..  ఎలీసా టెస్ట్ లో నెగెటివ్​వస్తోంది.  ప్రస్తుతం తీవ్రమైన జ్వరాలకు కారణం  చికెన్ గున్యా  వైరస్ లాంటి మరో వైరస్ కారణం కావచ్చు.  తీవ్ర  జ్వరంతో  బాధపడే వారికి తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సివస్తోంది.  జ్వరాలు తగ్గినా  నొప్పులు మరో  20 రోజుల వరకు ఉంటున్నాయి.  ఈ జ్వరాలొచ్చిన వారు  యాంటీబయోటిక్స్ ఎక్కువగా  వాడకుండా పారాసిటమాల్ వాడాలి.  ఫ్రూట్ జ్యూ స్, ఓ ఆర్ ఎస్ తో పాటు లిక్విడ్​ఫుడ్​  తీసుకోవాలి.  –  డాక్టర్ ప్రశాంత్, హెచ్ ఓ డి, జనరల్ మెడిసిన్,  గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిర్మల్.


జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు.. 

జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో  జిల్లా ఆసుపత్రిలో  అన్ని  ఏర్పాట్లు చేశాం. ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున  అదనపు బెడ్లను  సమకూరుస్తున్నాం.   అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.  డెంగ్యూ బాధితులకు   ప్లేట్​లెట్లు  అందించేందుకు ఎడీపీ యంత్రాన్ని  అందుబాటులోకి తెచ్చాం.   ప్రైవేట్ ఆస్పత్రుల  కన్నా  మెరుగైన సౌకర్యాలున్నాయి. డాక్టర్లు కూడా ఎప్పుడూ  అందుబాటులో ఉంటారు.  - డాక్టర్ సునీల్, సూపరిండెంట్,నిర్మల్ జిల్లా ఆసుపత్రి.