హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. గ్రామాల నుంచి హైదరాబాద్ మహానగరం దాకా లక్షలాది మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వల్ల వచ్చే దగ్గు, జలుబుతో పాటు డెంగీ, టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్నారు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. గత నెలలో 1,949 డెంగీ కేసులు నమోదవగా.. ఈ నెలలో తొలి పది రోజుల్లోనే 1,380 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని దవాఖాన్లు ఫీవర్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను గ్రామాల్లోని డాక్టర్లు హైదరాబాద్ పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. దీంతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియాకూ పేషెంట్ల తాకిడి పెరిగింది.
సాధారణ రోజుల్లో నమోదయ్యే ఓపీ కంటే 50 శాతం ఎక్కువగా అవుట్ పేషెంట్లు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో సాధారణంగా 350 నుంచి 400 ఓపీ నమోదయ్యేవని..ఇప్పుడు ఆ సంఖ్య 600 దాటుతోందని అంటున్నారు. ఫీవర్ పేషెంట్ల కోసం కేటాయించిన వార్డులు పూర్తిగా నిండిపోతుండగా.. జ్వరాలతో చనిపోతున్నవారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతున్నది.కాగా.. జ్వరాలతో సంభవించిన మరణాలు అధికారిక లెక్కల్లోకి ఎక్కడం లేదు.
ప్లేట్‌లెట్ల తంటా..
డెంగీ వంటి జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లకు ప్లేట్‌లెట్స్ ఎక్కించే పేరుతో ప్రైవేటు దవాఖాన్లు భారీ వసూళ్లకు దిగాయి. పేషెంట్ నాలుగైదు రోజులు దవాఖానలో ఉంటే 50 వేల నుంచి లక్ష రూపాయల బిల్లు వేస్తున్నాయి. కార్పొరేట్ దవాఖాన్లలో లక్షకుపైనే బిల్లు రాస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్తే ప్లేట్‌లెట్స్ తెచ్చుకోవాలని సూచిస్తూ మళ్లీ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకే పంపిస్తున్నారు. బ్లడ్, బ్లడ్ కాంపొనెంట్స్ సెపరేట్ చేసే మిషన్లు అందుబాటులో ఉన్న దవాఖాన్లలోనూ ఇదే తీరు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో దవాఖాన్ల సూపరింటెండెంట్లు, బ్లడ్ బ్యాంకుల ఇన్ చార్జులపై సర్కార్ సీరియస్ అయింది. పేషెంట్లకు బ్లడ్, బ్లడ్ కాంపొనెంట్స్ ఏది అవసరమైనా అందించాల్సిన బాధ్యత హాస్పిటల్స్ దేనని హెల్త్ సెక్రటరీ రిజ్వీ స్పష్టం చేశారు. బ్లడ్ సేకరణకు క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
ALSO READ:తెలంగాణలో సన్న బియ్యం మస్తు పిరం
డాక్టర్లు అందుబాటులో ఉండాలె
ఫీవర్ కేసులు ఎక్కువైతుండడంతో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, దవాఖాన్ల సూపరింటెండెంట్లతో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో కొత్తగూడెంలో మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు రిజ్వీకి తెలిపారు. పరిస్థితి విషమించాకే పేషెంట్లు దవాఖాన్లకు వస్తుండటంతో రికవరీ కష్టంగా మారుతోందని వివరించారు. పేషెంట్లను ఆర్‌ఎంపీలు మిస్ లీడ్ చేస్తున్నారని సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు. పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు, పీహెచ్‌సీలు ఉన్నప్పటికీ పేషెంట్లు ఆర్‌ఎంపీలను ఎందుకు ఆశ్రయిస్తున్నారని రిజ్వీ అధికారులను ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తేల్చిచెప్పారు. లేకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లను రిజ్వీ ఆదేశించారు.
ఒక్కో బెడ్డుపై ఇద్దరికి ట్రీట్‌మెంట్
పేషెంట్ లోడ్ పెరగడంతో చాలా ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. దీంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరిని ఉంచి ట్రీట్‌మెంట్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ పిల్లల వార్డులో 70 బెడ్లు ఉండగా, ప్రస్తుతం అక్కడ 110 మంది అడ్మిటయ్యారు. దీంతో బుధవారం అదనంగా మరో 20 బెడ్లను ఏర్పాటు చేశారు. అయినా కొత్త పేషెంట్ వస్తే అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా మారిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లలేక, రిమ్స్‌లోనే బెడ్డు కోసం జర్వం వచ్చిన తమ పిల్లలను పట్టుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు.
జాగ్రత్తగా ఉండండి
రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువయ్యాయి.మా హాస్పిటల్ లోని ఫీవర్ వార్డు పూర్తిగా పేషెంట్లతో నిండిపోయింది. జనాలు మాస్క్ ధరిం చడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటిం చాలి. దగ్గు, జలుబు, ఫీవర్ ఉన్నవాళ్లు బాధ్యతతో మెలగాలి. సకాలంలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.
‑ డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్,
ఫీవర్ హాస్పిటల్, హైదరాబాద్