చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని 12, 13 వార్డు పరిధిలో వారం రోజులుగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చికెన్‌గున్యా మాదిరిగా ఒళ్లు నొప్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వార్డులో రెగ్యులర్‌గా చెత్త సేకరణ, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు బెడద పెరిగి వ్యాధుల బారినపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వర బాధితులు ఉంటున్నారు.
ముఖ్యంగా కీళ్లు, ఒళ్ళు నొప్పులతో మహిళలు బాధపడుతూ కదల్లేకపోతున్నారు. జ్వరాలపై మున్సిపల్ కమిషనర్‌కు స్థానికులు సమాచారం ఇవ్వగా ఆరోగ్య సిబ్బంది కొన్ని ఇండ్లకు తిరిగి మలేరియా పరీక్షలు చేసి, జ్వరం టాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
జగ్గసాగర్‌లో ఇంటింటా సర్వే
మెట్ పల్లి, వెలుగు: మెట్‌పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం గ్రామంలో ఆరుగురు డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటి సర్వే నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దనే వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. జ్వరం ఎక్కువగా ఉన్న వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెడికల్ఆఫీసర్ అంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.