- హై రిస్క్ లిస్ట్‌లో పాలమూరు, వనపర్తి
- వనపర్తి, మహబూబ్‌నగర్‌లో 36కు పైగా చికున్ గున్యా కేసులు
- వివరాలు వెల్లడించిన రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు :సీజనల్ వ్యాధులతో ఉమ్మడి పాలమూరు జిల్లా వణికిపోతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్యం సరిగా లేకపోవడంతో దోమలు ఎక్కువై డెంగ్యూ, చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన బులిటెన్లోనూ పాలమూరు, వనపర్తి జిల్లా హై రిస్క్ జిల్లాలో జాబితాలో ఉన్నాయి.
చికున్ గున్యా కేసుల్లో టాప్
ఐదు రోజుల కిందట రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా కేసుల వివరాలను వెల్లడించింది. చికున్ గున్యా డిసీజ్‌కు సంబంధించి రాష్ర్ట వ్యాప్తంగా 2,673 మందికి పరీక్షలు చేయగా.. 152 మందికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. ఎక్కువగా హైదరాబాద్‌లో 61 కేసులు ఉండగా మహబూబ్‌నగర్‌లో 19, వనపర్తిలో 17 కేసులు బయట పడ్డాయి. ఈ మూడు జిల్లాలను రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ హై రిస్క్ జిల్లాల జాబితాలోకి చేర్చింది.
250 వరకు డెంగ్యూ కేసులు..
పాలమూరు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో డెంగ్యూ బాధితులతో హాస్పిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రతి రోజూ సర్కారు హాస్పిటళ్లలో ఔట్ పేషంట్లు (ఓపీ) 1,700లకు దాటిపోతుండగా.. ఇన్ పేషంట్లు (ఐపీ) 320 వరకు ఉంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటి 131 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.
ఇందులో 49 మంది చిన్నపిల్లలకు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 72 మందికి, నారాయణపేటలో జిల్లాలో 22 మంది పాజిటివ్ అని తేలింది. సర్కారు హాస్పిటల్స్‌లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెంగ్యూ బాధితులు చేరుతున్నారు. ఒక్కో హాస్పిటల్లో 50 నుంచి 80 వరకు ఓపీ వస్తుండగా.. ఇందులో 20 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. అయితే.. కేసుల వివరాలను చెప్పేందుకు వైద, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. కొద్ది రోజులుగా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఆ డేటాను చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.
ALSO READ : భూములు ఇచ్చేదేలే .. జీవనాధారం కోల్పోతామని రైతుల ఆందోళన
మూడు రోజులకు రూ.10 వేల బిల్
డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు దోపిడి చేస్తున్నాయి. సాధారణ జ్వరంతో ప్రజలు హాస్పిటల్స్‌కు వస్తున్నా.. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు రాసి డబ్బులు గుంజుతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియా పాజిటివ్ వస్తే అడ్మిట్ చేయించుకొని.. మూడు రోజులకు రూ.10 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. ఇవి కాకుండా మెడిసిన్‌కు అదనంగా డబ్బులు వసూల్ చేయడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
దోమల నివారణకు చర్యలేవీ
దోమల నివారణకు ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రతి మున్సిపాల్టీలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంత వరకు మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ చేయడం లేదు. వర్షాల వల్ల కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉంటున్నా.. బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు.
గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కొందరు ప్రత్యేక అధికారులు వారంలో ఒకసారే గ్రామ పంచాయతీలను విజిట్ చేస్తుండటంతో పర్యవేక్షణ కరువైంది. వ్యాధుల సీజన్ కావడంతో ప్రతి గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉంది. కానీ, చాలా పంచాయతీల్లో ఈ మెషీన్లు పని చేయడం లేదు. అవి మూలకు చేరడంతో ఫాగింగ్ చేయడం లేదు. దీంతో దోమల బెడద ఎక్కువైంది. అదే సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ కేసులు కూడా అధికమయ్యాయి.