వణికిస్తున్న వైరల్ ఫీవర్స్ .. ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు

వణికిస్తున్న వైరల్ ఫీవర్స్ .. ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు
  • సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, చికున్​గున్యా కేసులు
  • ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు
  • కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు

సిద్దిపేట, వెలుగు: జిల్లా ప్రజలను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేట్​ఆస్పత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్​గున్యా వంటి కేసులు పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 33 పీహెచ్​సీ , 2 అర్బన్, మెడికల్​కాలేజ్​కు చెందిన ఆస్పత్రుల్లో ప్రతిరోజు వందల సంఖ్య లో జ్వరపీడితులు చికిత్స కోసం వస్తున్నారు. విపరీతమైన జ్వరం, ప్లేట్ లెట్స్ పడిపోవడం, చలి జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

 డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్స్ అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వ వైధ్యాధికారులు చెబుతున్నా పరిస్థితులు అందుకు భిన్నంగా  ఉన్నాయి. హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ పట్టణాల్లో ఉన్న ఆస్పత్రుల్లో అధిక సంఖ్యలో రోగులు ఇన్​పేషంట్లుగా చేరుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2 డెంగ్యూ మరణాలు సంభవించాయి. డెంగ్యూకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య బయటకురావడం లేదు. మరోవైపు చికున్​గున్యా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. 

Also Read:-ఫిరంగి నాలాపై జన్వాడఫామ్​హౌస్

చేతివాటం చూపిస్తున్న ప్రైవేట్​హాస్పిటల్స్​..

వైరల్ ఫీవర్స్ విపరీతంగా పెరగడంతో ప్రైవేట్ హాస్పిటల్స్​లో కాసుల వర్షం కురుస్తోంది. గ్రామాల్లో ఆర్​ఎంపీ, పీఎంపీలు కమీషన్లకు ఆశపడి రోగులను ప్రైవేట్​హాస్పిటల్స్​కు రెఫర్​ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది టెస్టుల పేరిట అందనకాడికి దండుకుంటున్నారు. వైరల్ ఫీవర్​తో బాధపడుతున్న  ఒక్కో రోగి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఒకవేళ ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోతే రూ. పాతిక వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

కొన్ని ప్రాంతాల్లో ప్లేట్​ లెట్స్ వేగంగా పడిపోతున్నాయంటూ భయపెడుతూ ఐసీయూలో చేర్చి చికిత్సల పేరిట దోచుకుంటున్నారు. ఇలాంటీ కేసుల్లో లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విపరీతమైన జ్వరంతో బాధపడుతూ వస్తున్న రోగులను ఇన్ పేషంట్లుగా చేర్చుకుంటున్న ఆస్పత్రుల నిర్వాహకులు పరిస్థితి చేయిదాటితే  హైదరాబాద్ కు రిఫర్​ చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేటలో మూడేండ్ల బాలుడిని నాలుగు రోజులు ఇన్ పేషంట్ గా చికిత్స అందించి చివరి నిమిషంలో మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో మార్గమధ్యలోనే ఆ బాలుడు చనిపోయాడు.
 
అధికారిక లెక్కల ప్రకారం..

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో డెంగ్యూ 40, ఫీవర్స్ 7వేలు, మలేరియా 2, టైఫాయిడ్ 25 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారులు చొరవ చూపకపోవడం, పారిశుధ్య పనులు సక్రమంగా జరగక పోవడం వల్ల వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబంలో ఉన్న మొత్తం సభ్యులు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న కేసులు ఉన్నాయి. మరోవైపు జ్వరాలు రాకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మెడికల్​క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నా జ్వరాలు ఆగడంలేదు. 

ప్లేట్ లెట్స్ పడిపోతే జాయిన్ అయ్యా

వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. టెస్టులు చేయించుకుంటే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని తేలింది. దీంతో జిల్లా ఆస్పత్రిలో ఇన్​పేషెంట్​గా చేరా. ప్లేట్ లెట్స్ సంఖ్య 30 వేలకు పడిపోవడంతో డాక్టర్లు డెంగ్యూగా నిర్థారించి ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. నాలాగా చాలామంది డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. 

కన్నె రాములు, సిద్దిపేట

మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా..

మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే డాక్టర్ల సూచన మేరకు సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ఇన్ పేషంట్ గా చేరాను. గ్రామంలో ప్రైవేట్​ డాక్టర్ వద్ద చూపించుకున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు పరీక్షలు నిర్వహించి  డెంగ్యూ వచ్చిందని తేల్చారు.  

చంద్రశేఖర్, రాఘవపూర్