అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ దోచుకుంటున్న ప్రైవేటు డాక్టర్లు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దవాఖానాకు పోతే ప్రైవేట్ఆస్పత్రులు, ల్యాబ్ నిర్వాహకులు జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదును అన్నట్లు టెస్టుల మీద టెస్టులు చేసి దోచుకుంటున్నారు. రోజుకు రూ. 20 లక్షల బిజినెస్ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు జ్వరాల బారిన పడుతుండడంతో పీహెచ్సీ, సీహెచ్‌సీలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ఓపీ తాకిడి పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ట్రీట్మెంట్కోసం క్యూ కడుతున్నారు. సీహెచ్‌సీ సెంటర్లలో రోజుకు 200 నుంచి 300 వరకు జ్వర బాధితులు వస్తుంటే.. భువనగిరిలోని ఏరియా హాస్పిటల్‌కు వచ్చే వారి సంఖ్య 500 దాటుతోంది. హాస్పిటల్స్‌లో బెడ్స్ నిండిపోతున్నాయి. రోగులకు జ్వర తీవ్రత తగ్గగానే.. వారిని డిశ్చార్జ్ చేస్తూ వేరే పేషెంట్‌కు బెడ్ కేటాయిస్తున్నారు.
టెస్టుల మీద టెస్టులు..
యాదాద్రి జిల్లాపై ప్రస్తుతం టైపాయిడ్ పంజా విసురుతోంది. దీనికి తోడు డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కొన్ని రకాల టెస్టులు చేస్తున్నప్పటికీ.. సీబీపీ వంటివి ప్రైవేట్‌కు సిఫారసు చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏరియా హాస్పిటల్లో రోజుకు వంద, సీహెచ్‌సీ సెంటర్లలో దాదాపు 30 నుంచి 50 వరకు చేస్తున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తాకిడి పెరిగింది. జ్వరంతో హాస్పిటల్‌కు వచ్చిన రోగికి వ్యాధి నిర్దారణ పేరుతో డాక్టర్లు టెస్టులు రాస్తున్నారు. ఒక్కొక్కరికి టైపాయిడ్, మలేరియా, సీబీపీ , కంప్లీట్ యూరిన్, సహా మొత్తం ఆరు రకాల టెస్టులు రాస్తున్నారు. ఈ టెస్టులకు రూ.1,000 నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 50 వరకు టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలోని 50కి పైగా ఉన్న ల్యాబ్‌ల నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు. యావరేజ్‌గా రోజుకు 2వేల టెస్టులు లెక్కేసినా దాదాపు రూ. 20 లక్షలు బిజినెస్ చేసుకుంటున్నారు. పైగా డెంగీ పేరుతో చేసే టెస్టులు అదనం. ఒక్కో రాపిడ్ టెస్ట్‌కే రూ. 750 నుంచి రూ. 1,000 వసూలు చేస్తున్నారు.
ల్యాబ్ నిర్వాహకుల టెస్టుల దోపిడీ తెలిసినా.. తమకెందుకులే అన్నట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్స్టాఫ్ ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారు.
డెంగీ కలకలం
యాదాద్రి జిల్లాలో డెంగీ కలకలం మొదలైంది. గడిచిన రెండేండ్లలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి గత నెల 20 వరకూ ఐదు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 10 రోజుల్లో జిల్లాలోని 9 పీహెచ్సీ ల పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి. వీరిలో స్టేజ్– 2లో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి డెంగీ నిర్దారణ టెస్టు యాదాద్రి జిల్లా గవర్నమెంట్హాస్పిటల్స్లో లేదు. ఇక్కడి నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపించడం, అక్కడ ఎలీషా టెస్టు చేయించిన తర్వాతే అది డెంగీయా.? కాదా.? అన్నది తేలుతుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులను ఆశ్రయిస్తూ వారి ద్వారా రాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. రూ. 250 తో టెస్ట్ చేయాల్సి ఉండగా రాపిడ్ టెస్ట్‌కే రూ. 750 నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రాపిడ్టెస్ట్తో డెంగీ నిర్ధారణ ప్రామాణికం కాకున్నా , డెంగీ
పేరుతో ట్రీట్మెంట్కు ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఇక టైపాయిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విష జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి అలర్ట్చేయాల్సిన హెల్త్ డిపార్ట్మెంట్ కేసుల సంఖ్యను దాచి, అంతా బాగుందన్నట్లుగా వ్యవహరిస్తోంది.
వెయ్యి రూపాయలు తీసుకున్నరు..
జ్వరంతో ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లాను. డాక్టర్ ఆరు రకాల టెస్టులు రాశారు. ల్యాబ్‌కు వెళ్లగానే.. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకొని రూ. 1,200 బిల్లు చెప్పాడు. బతిమిలాడితే 1,000 తీసుకున్నాడు.
– శ్రీనివాస్, భువనగిరి