బెడ్ మీద నుంచి లేచొచ్చిన కోమా పేషెంట్.. డాక్టర్లు దోచుకుంటున్నారంటూ ఫైర్..

బెడ్ మీద నుంచి లేచొచ్చిన కోమా పేషెంట్.. డాక్టర్లు దోచుకుంటున్నారంటూ ఫైర్..

మధ్యప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కోమా పేషెంట్ అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశాడు. టాయిలెట్ బ్యాగ్ తో, ముఖానికి ఆక్సిజన్ పైప్ తో ఉన్న ఆ పేషెంట్ రోడ్డుపై హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మార్చి 3న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా జరిగిన ఓ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ మోతీనగర్ కి చెందిన బంటీ అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జీడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు బంటీ.

జీడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయానికి బంటీ కోమాలో ఉన్నాడని తన భార్య తెలిపింది. బంటీని హాస్పిటల్లో జాయిన్ చేసే సమయంలో రూ. 40వేలు చెల్లించామని.. డబ్బు ఇంకా అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తెచ్చుకోవడానికి తమ గ్రామానికి వెళ్లానని తెలిపింది బంటీ భార్య. డబ్బులు తీసుకొని తిరిగి వచ్చేసరికి.. తన భర్త అర్ధనగ్నంగా హాస్పిటల్ బయట అరుస్తూ కనిపించాడని తెలిపింది బంటీ భార్య.

బెడ్ మీద నుంచి లేచొచ్చిన బంటీని చూసి షాక్ అయ్యానని.. తనకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు రూ. లక్ష వసూలు చేస్తున్నారంటూ బంటీ గట్టిగట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హాస్పిటల్ యాజమాన్యంపై విచారణకు ఆదేశించారు.

కాగా.. పేషెంట్ నుండి రూ. లక్ష వసూలు చేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని.. పేషెంట్ నుండి రూ. 8వేలు మాత్రమే తీసుకున్నామని హాస్పిటల్ యాజమాన్యం అంటోంది.