
ఉగ్ర దాడికి బలైపోయిన వినయ్ నర్వాల్, అతని భార్య ఈ ఘటనకు ముందు సంతోషంగా గడిపిన వీడియో ఇదేనంటూ నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. బైసరన్ వ్యాలీలో యంగ్ కపుల్ డ్యాన్స్ చేస్తున్న 19 సెకన్ల క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోలో డ్యాన్స్ చేసింది వినయ్ నర్వాల్, అతని భార్య హిమాన్షి అని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దిన పత్రికల్లో కూడా ఆ జంట డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు ప్రచురితమయ్యాయి. కానీ.. ఆ వీడియోలో ఉంది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదని తెలిసింది. ఆ వీడియోలో ఉన్న జంట ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ అని.. ఈ జంట ఒక వీడియో విడుదల చేసి స్పష్టత ఇచ్చారు.
భారత రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆశిష్ షెహ్రావత్ ఏప్రిల్ 14న యషిక శర్మతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో అది. ఏప్రిల్ 22న ఆ వీడియోను సోషల్ మీడియాలో ఈ జంట పోస్ట్ చేసింది. అయితే.. అదే రోజు బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకోవడంతో ఈ జంట పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియోపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ చోట ఇంత ఘోరం జరిగితే ఇలా ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడం ఏంటని ఈ జంటపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో.. ఆ వీడియోను ఆశిష్ షెహ్రావత్ డిలీట్ చేశాడు. కానీ.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి అని తప్పుగా ప్రచారం జరుగుతుండటంతో స్పష్టత ఇస్తూ ఒక వీడియోను ఆశిష్ షెహ్రావత్ పోస్ట్ చేశాడు. తాము బతికే ఉన్నామని, ఆ వీడియోలో ఉన్నది తామేనని ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ స్పష్టం చేశారు.
మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ ప్రాంతంలో ఉగ్రమూకల నరమేధానికి బలైన 26 మంది పర్యాటకుల్లో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు. వారం క్రితమే వినయ్ నర్వాల్కు హిమాన్షితో వివాహం అయింది. హనీమూన్ కోసం వెళ్లిన కొత్త దంపతులు ఇద్దరూ సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో అక్కడకు వెళ్లిన ఉగ్రమూకలు వినయ్ తలపై గురిపెట్టి కాల్చేశారు.
ఇండియన్ నేవీలో రెండేండ్ల కిందట లెఫ్టినెంట్గా విధుల్లో చేరిన హర్యానాకు చెందిన 26 ఏండ్ల వినయ్ నర్వాల్ కు వారం రోజుల క్రితమే.. ఏప్రిల్ 16న పెండ్లి జరిగింది. భార్య హిమాన్షిని తీసుకుని హనీమూన్ కోసమని బైసరన్కు వచ్చాడు. కానీ నూరేండ్ల జీవితాన్ని పంచుకోవాలని చేయి పట్టుకుని నడిపించుకు వచ్చిన భర్తను కండ్ల ముందే టెర్రరిస్టులు బలి తీసుకోవడంతో ఆమెకు తీరని వ్యధ మిగిలింది. కొత్త దంపతులు ఇద్దరూ సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో వచ్చిన ఉగ్రమూకలు.. వినయ్ తలపై గురిపెట్టి కాల్చేశారు.