శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెదకాపు-1’తో హీరోగా పరిచయం అవుతున్నాడు విరాట్ కర్ణ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో విరాట్ కర్ణ ఇలా మాట్లాడాడు. ‘‘ఎయిటీస్‌లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినపుడు అందరూ కొత్తవాళ్ళని తీసుకున్నారు. ఆ సమయంలో ఒక సామాన్యుడు ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఒక బలవంతుడితో పోరాడి ఎలా ఎదిగాడనేది కథ. ఇందుకు ఓ కొత్త వాడైతే బావుంటుందని నాతో శ్రీకాంత్ గారు ఈ సినిమా చేశారు.
అప్పటి పరిస్థితులు, రూరల్ ఏరియాల్లో ఎలా ఉండేవారు, ఎలా ప్రవర్తించేవారు అనే విషయాలపై చాలా వర్క్ షాప్ చేశాం. డైలాగ్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. సీనియర్స్ అంతా నన్ను ఓ కొత్తవాడిగా కాకుండా చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్న నటుడిగానే భావించారు. చాలా కంఫర్ట్ నెస్ ఇచ్చారు. నిర్మాతగా రవీందర్ రెడ్డి గారు కాకపొతే ఇంతపెద్ద కాన్వాస్ నాకు దొరికేది కాదు. నాపై ఇంత ఖర్చు చేస్తున్నారనే భయం వుండేది. దాంతో ఇంకా బాగా చేయగలిగాను. నిజానికి ఆయన ఈ కథని ఎక్కువ నమ్మి తీశారు. ఇందులో ఓ ఎమోషనల్ సీన్ ఉంది.
దాన్ని చాలా సులువుగా చేశాను. అది చూసి పీటర్ హెయిన్స్ మాస్టర్ ‘నిన్ను గ్రేడ్ ఏ హీరోగా సర్టిఫై చేస్తున్నా’ అన్నారు. అది విని అక్కడే ఉన్న మా బా వ (నిర్మాత రవీందర్ రెడ్డి) గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని అలా చూడటం మొదటిసారి. అది చూసి చాలా ఆనందంగా అనిపించింది. అవుట్‌పుట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’’.