PBKS vs RCB: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు అతడే అర్హుడు: విరాట్ కోహ్లీ

PBKS vs RCB: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు అతడే అర్హుడు: విరాట్ కోహ్లీ

ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గొప్ప మనసుతో  హాట్ టాపిక్ గా నిలిచాడు. చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తన నిజాయితీని చాటుకున్నాడు. 158 పరుగుల ఛేజింగ్ లో కోహ్లీ (54 బంతుల్లో 73: 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయం కోసం చివరి వరకు క్రీజ్ లో ఉన్న విరాట్.. 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

కోహ్లీ ఇన్నింగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం పట్ల కోహ్లీ సంతోషంగా లేనట్టు తెలుస్తుంది. అవార్డు తీసుకున్న తర్వాత మాట్లాడుతూ.. " ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకెందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. దేవదత్ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు అర్హుడు. తన ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు". అని కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్ లో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడికల్.. ఓవరాల్ గా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. 

ఓ వైపు కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుండగా.. మరో ఎండ్ లో దేవదత్ రెచ్చిపోయి ఆడాడు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడికల్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ, పడికల్ భాగస్వామ్యం బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని అందించారు. వీరిద్దరి భాగస్యామ్యంతో తో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.