PBKS vs RCB: పరుగో పరుగు: ఫోర్ ఆపినా నాలుగు పరుగులు.. చిరుతలా పరిగెత్తిన కోహ్లీ, పడికల్

PBKS vs RCB: పరుగో పరుగు: ఫోర్ ఆపినా నాలుగు పరుగులు.. చిరుతలా పరిగెత్తిన కోహ్లీ, పడికల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 36 ఏళ్ళ వయసులోనూ అత్యుత్తమ ఫిట్ నెస్ తో క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య పరిగెత్తడంలో కోహ్లీ తనకు తానే సాటి. ఐపీఎల్ లో ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన పరుగుతో ఔరా అనిపించాడు. చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ, పడికల్ పోటీ పడీ మరీ పరిగెత్తారు. 

ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి ఈ ఘనత చోటు చేసుకుంది. అర్షదీప్ వేసిన బంతిని పడికల్ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. గ్యాప్ లో షాట్ ఆడడంతో బంతి బౌండరీ చేరుకుందని అందరూ భావించారు. అయితే ఈ దశలో నేహాల్ వధేరా కాలితో బంతిని ఆపి బౌండరీ అవతలకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగివచ్చి బంతి అందించే లోపు కోహ్లీ, పడికల్ నాలుగు పరుగులే తిరిగేశారు. సాధారణంగా క్రికెట్ ఫీల్డ్ లో నాలుగు పరుగులు తిరగడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కోహ్లీ పట్టుదలతో బౌండరీ కొట్టకపోయినా ఫోర్ రన్స్ తిరగడం హైలెట్ గా మారింది. 

ఈ మ్యాచ్ లో కోహ్లీ, పడికల్ భాగస్వామ్యం బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని అందించారు. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61:5 ఫోర్లు, 4సిక్సర్లు) తో పాటు విరాట్ కోహ్లీ(54 బంతుల్లో 73: 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి భాగస్యామ్యంతో తో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.