Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల బెడద.. రంజీ ట్రోఫీ నుంచి కోహ్లీ, రాహుల్‌ ఔట్

రంజీ ట్రోఫీకి సమయం దగ్గర పడుతుంది. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఫామ్ లేమి కారణంగా ఈ టోర్నీలో ఈ సారి భారత క్రికెటర్ ప్లేయర్లు ఆడనుండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. దీనికి కారణం వీరిద్దరికీ గాయాలు కావడమే. 

ప్రస్తుతం కోహ్లీ మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. పూర్తి ఫిట్ గా లేని కారణంగా అతను రంజీ ట్రోఫీ మ్యాచ్ లకు దూరం అవుతున్నట్టు బీసీసీఐకి వెల్లడించినట్టు సమాచారం. 2012లో ఢిల్లీ తరఫున చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. మరో 12 ఏళ్ళ తర్వాత కోహ్లీని రంజీల్లో చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాచ్ ఆడకపోయినా  రాజ్‌కోట్‌లో వెళ్లి ఢిల్లీ జట్టుతో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్ మోచెయ్యి వాపు కారణంగా రంజీ ట్రోఫీకి దూరం కానున్నట్టు తెలుస్తుంది.

వచ్చే నెలలో రాహుల్, కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నారు. ఈ మెగా టోర్నీ ముందు వీరిని ఆడించే రిస్క్ బీసీసీఐ చేయడం లేదని తెలుస్తుంది. శనివారం (జనవరి 18) ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కోహ్లీ, రాహుల్ ఆడకపోయినా రిషబ్ పంత్, శుభమాన్ గిల్, యశస్వి జైశ్వాల్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. 2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కు ముందు భారత ఆటగాళ్లందరూ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడాలని ఇటీవలే బీసీసీఐ తప్పనిసరి చేసింది.