MI vs RCB: పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కోహ్లీ, జితేష్ మెరుపులు.. ముంబై ముందు బిగ్ టార్గెట్!

MI vs RCB: పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కోహ్లీ, జితేష్ మెరుపులు.. ముంబై ముందు బిగ్ టార్గెట్!

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో విజృంభించింది. కెప్టెన్ పటిదార్(32 బంతుల్లో 64:5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు.. కోహ్లీ(42 బంతుల్లో 67:8 ఫోర్లు,2 సిక్సర్లు), జితేష్ శర్మ(19 బంతుల్లో 40:2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (67) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బోల్ట్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీసుకున్నారు. విగ్నేష్ పుథూర్ కి ఒక వికెట్ దక్కింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ సాల్ట్ (4) తొలి బంతికి బౌండరీ బాదినా రెండో బంతికి బోల్ట్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ దశలో కోహ్లీకి జత కలిసిన పడికల్ ముంబై బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఇద్దరూ పవర్ ప్లే లో చెలరేగడంతో 73 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉన్నత సేపు వేగంగా ఆడిన పడికల్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి పవర్ ప్లే తర్వాత ఔటయ్యాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 91 పరుగులు జోడించడం విశేషం.

కెప్టెన్ పటిదార్ తో కలిసి కోహ్లీ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ వేగంగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో కోహ్లీ 67 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. వెంటనే లివింగ్ స్టోన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత  క్రీజ్ లోకి వచ్చిన జితేష్, పటిదార్ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 200 పరుగుల మార్క్ దాటించారు. ఈ క్రమంలో పటిదార్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్న జితేష్ 19 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.