India vs India A: కుర్రాళ్లతో మ్యాచ్: ప్రాక్టీస్‌లోనూ కోహ్లీ విఫలం.. పంత్‌ను బౌల్డ్ చేసిన నితీష్

India vs India A: కుర్రాళ్లతో మ్యాచ్: ప్రాక్టీస్‌లోనూ కోహ్లీ విఫలం.. పంత్‌ను బౌల్డ్ చేసిన నితీష్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు.. కుర్రాళ్లతో శుక్రవారం (నవంబర్ 15) జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో నిరాశ పరిచారు. బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు, భారత ఏ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించింది. పెర్త్ వేదికగా వాకా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు సీనియర్ జట్టుపై ఆధిపత్యం చూపించింది. యువ పేసర్ల ధాటికి ఒక్క బ్యాటర్ కూడా నిలబడలేకపోయారు. ముఖ్యంగా పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ఈ మ్యాచ్ లో కోహ్లీ తన బలహీనతను మరోసారి బయట పెట్టాడు. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడబోయి సెకండ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గతంలో కోహ్లీ ఇదే తరహాలో చాలా సార్లు ఔటయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైశ్వాల్ 15 పరుగులకే ఔట్ కాగా.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రిషబ్ పంత్ ను 19 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. మిగిలిన ఆటగాళ్లలో గిల్ 29 పరుగులు చేయగా.. 29 పరుగుల వద్దే రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 

ALSO READ | Ranji Trophy 2024-25: 39 ఏళ్ళ తర్వాత మరోసారి: ప్రత్యర్థి జట్టుని అలౌట్ చేసిన ఒకే ఒక్కడు

ఈ మ్యాచ్ లో ఒక్క భారత బ్యాటర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. యువ పేసర్లు ముఖేష్ కుమార్, ప్రసిద్ కృష్ణ, నవదీప్ సైనీ, నితీష్ కుమార్ రెడ్డి ధాటికి ఒక్కరు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. అసలే ఇటీవలే న్యూజీలాండ్ తో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ప్రాక్టీస్ లో విఫలం కావడం ఆందోళన కలిగిస్తుంది. నవంబర్ 22 న ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా భారత్ తొలి టెస్ట్ ఆడనుంది .