సత్తా తగ్గలేదు.. టీ20లు ఆడతాం.. బీసీసీఐకి తెలియజేసిన రోహిత్, కోహ్లీ

సత్తా తగ్గలేదు.. టీ20లు ఆడతాం.. బీసీసీఐకి తెలియజేసిన రోహిత్, కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశారని గతకొంతకాలంగా అనేక ప్రశ్నలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది వన్డే వరల్డ్ కప్ ముందువరకూ పొట్టి ఫార్మాట్‌లో అడపాదడపా కనిపించిన ఈ స్టార్లిద్దరూ.. ఏడాది చివరలో దక్షణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో వీరిద్దరూ ఇకపై దేశం తరుపున టీ20 ఫార్మాట్‌లో కనిపించరని అనేక కథనాలు వచ్చాయి. అయితే, అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. 

పొట్టి ఫార్మాట్‌లో ఆడేందుకు తాము సిద్ధమని రోహిత్, కోహ్లీలు బీసీసీఐకి తెలియజేశారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ముగిసిన అనంతరం భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు సెలక్టర్లు శివ్‌సుందర్‌ దాస్‌, సలీల్‌ అంకోలాలు.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వీరు మున్ముందు టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతారా..? లేదా? అనే చర్చ జరగ్గా.. పొట్టి ఫార్మాట్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బందిలేదని రోహిత్, కోహ్లీలు తెలియజేశారు. దీంతో వీరివురు ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు మార్గం సుగమైంది.

రోహిత్‌కే టీ20 కెప్టెన్సీ..!

రోహిత్ స్థానంలో టీ20 పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా గాయంతో బాధపడుతున్నాడు. అతని గైర్హాజరీతో టీ20 బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి అదే. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో భారత జట్టు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరనే ప్రశ్న తరచూ వినపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందుకున్న ఏకైన ప్రత్యామ్న్యాయం.. రోహిత్ ఒక్కడే. టీ20లు తాను సిద్ధమని రోహిత్ తెలపడంతో బీసీసీఐకి ఒక తలనొప్పి తగ్గింది. అతన్నే టీ20 కెప్టెన్‌గా కొనసాగించనుంది.

రెండు రోజుల్లో జట్ల ప్రకటన

జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఈ రెండు సిరీస్‌లకు జట్టు ఎంపికకోసం సెలక్షన్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎవరెవరిని ఎంపిక చేయాలనేది ఓ కొలిక్కి వచ్చాక.. రెండు మూడు రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.